దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నేటి నుంచి మొదలైంది. తొలిరోజే 12.3 లక్షల మంది పిల్లలకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందింది. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతోన్న వేళ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసింది ఆరోగ్య శాఖ.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వరకు అందిన లెక్కల ప్రకారం 12.3 లక్షల పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందించారు.
కొవిన్ పోర్టల్ లెక్కల ప్రకారం 39.88 లక్షలకు పైగా అర్హులైన పిల్లలు వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
పాఠశాలలు, పలు కళాశాలలనే వ్యాక్సినేషన్ కేంద్రాలుగా మార్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. పిల్లలు, పెద్దలకు విడివిడిగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆరోగ్య శాఖ.
దిల్లీ..
దిల్లీలో మొత్తం 169 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సిన్ అందించారు. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా భాగమయ్యాయి. ఈ వారం మొత్తం ఇప్పటికే దిల్లీలో వ్యాక్సినేషన్ కోసం పిల్లలు రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలతో పాటు బహుమతులు కూడా అందిచారు. పువ్వులు, కలాలు, మాస్కులు ఇలా వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకు పలు బహుమతులు అందించారు అధికారులు.
ముంబయి నగరపాలక సంస్థ పిల్లలకు ఈ రోజు వ్యాక్సిన్ ఉచితంగా అందించింది. కేవలం బీఎంసీ నడిపే పాఠశాలలే కాకుండా మిగిలిన పాఠశాలల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఫ్రీగా అందించింది.
కర్ణాటక..
కర్ణాటకలో 31.75 లక్షల మంది అర్హులైన పిల్లలకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా సీఎం బసవరాజ్ బొమ్మై నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొదటి రోజు 4 వేల సెషన్లలో 6 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం యోచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు