దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా 33,750 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 1700 మార్కు దాటింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది. కొత్తగా 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 123 మంది ప్రాణాలు కోల్పోయారు.
- యాక్టివ్ కేసులు: 1,45,582
- మొత్తం రికవరీలు: 3,42,95,407
- మొత్తం మరణాలు: 4,81,893
- మొత్తం వ్యాక్సినేషన్: 1,45,68,89,306
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 11,877 కరోనా కేసులు వెలుగుచూశాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,41,542కు చేరింది.
రాష్ట్రంలో 42,024 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 11,877 కరోనా కేసుల్లో ఒక్క ముంబయిలోనే 7792 రావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ముంబయిలోనే 8,063 కేసులు నమోదయ్యాయి.
కేరళ..
కేరళలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. కొత్తగా 45 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 152కు చేరింది. 45 కేసుల్లో 9 మంది హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు కాగా 32 మంది లో రిస్క్ దేశాల నుంచి కేరళ వచ్చారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మిగిలిన నలుగురికి వీరి ద్వారా సోకిందని వెల్లడించారు.
తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఎర్నాకులం (16), తిరువనంతపురం (9), త్రిస్సూర్ (6), పతనంతిట్ట (5), అలప్పుజ, కోజికోడ్‌లో చెరో 3, మలప్పురం (2), వయనాడ్ (1) ఉన్నాయి.