Onion Prices Hike:


10 దేశాల్లో ప్రభావం..


ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. దాదాపు 10 దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆసియా, ఐరోపాలోని దేశాల్లో ధరలు అమాంతం పెరిగాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు ఎగుమతులను నిలిపివేశాయి. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్, టర్కీ, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఉక్రెయిన్, తజికిస్థాన్, అజెర్‌బయిజన్, ఆస్ట్రియా, మొరాకోలో ధరలు మిన్నంటుతున్నాయి. ఉల్లిగడ్డలతో పాటు క్యారెట్‌, టమోట, ఆలుగడ్డల ఎగుమతులనూ నిలిపివేశాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్ హెచ్చరించాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సరైన పోషకాహారం తీసుకోని వారి సంఖ్య 300 కోట్లుగా ఉంది. సబ్ సహరన్ ఆఫ్రికాలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. అక్కడి ధరలను తట్టుకోలేక చాలా మంది ప్రజలు కొనుగోలు చేయడం లేదు. కూరగాయల పరిస్థితీ ఇంతే. ే


కారణాలేంటి..? 


కరవులు, తుపాన్లు, వరదలు పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. డిమాండ్ మాత్రం కొండంత ఉంది. రోజువారీ వంటల్లో ఉల్లిగడ్డలు తప్పనిసరిగా వాడతారు. కానీ ఆ స్థాయిలో సరఫరా జరగడం లేదు. ప్రకృతి విపత్తులతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధమూ సమస్యలు తెచ్చి పెడుతోంది. ఫిలిప్పైన్స్‌లో రికార్డు స్థాయిలో కిలో ఉల్లి ధర రూ.1200గా ఉంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచే ఈ ధరల పెరుగుదల మొదలైంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు నాలుగు రెట్లు ప్రియం అయిపోయాయి. ఫిలిప్పైన్‌లో ఎర్ర ఉల్లిగడ్డలు దాదాపు అన్ని వంటల్లోనూ వాడతారు. ఈ దేశంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 33.3% మేర ధరలు అధికమయ్యాయి. టైఫూన్, నొరు, కర్దింగ్‌ లాంటి తుపానుల కారణంగా భారీగా వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఉల్లి పంట నాశనమైంది. వీటితో పాటు పంట పెట్టుబడి కూడా భారీగా పెరిగింది. ఇక మొరాకోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. అక్కడ ఆహార్ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఉల్లిగడ్డలు, టమోటలు, ఆలుగడ్డల్ని ఎగుమతి చేయకుండా నిషేధం విధించింది. స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చే సరఫరా కూడా దాదాపు రెండు వారాలుగా భారీగా తగ్గిపోయింది. నెదర్లాండ్స్‌లోనూ సప్లై తక్కువగానే ఉంది. టర్కీలో వరుస వరదలు పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. 


భారత్‌లో భిన్నంగా..


ప్రపంచవ్యాప్తంగా ఉల్లిధరలు భారీగా పెరుగుతుంటే..భారత్‌లో మాత్రం తగ్గిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడికి కనీసం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే..దీనిపై కేంద్రం స్పందించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో అత్యధికంగా ఉల్లి దిగుబడి ఉంటుంది. అక్కడి నుంచే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఉల్లిసాగు చేయని రాష్ట్రాలకు విక్రయించాలని వెల్లడించింది. ఇలా చేయడం వల్ల ధరలు కాస్త పెరిగే అవకాశముందని తెలిపింది. కొన్ని మార్కెట్‌లలో అయితే కిలో ఉల్లి ధర రూ.1,2 కి మించి పలకడం లేదు. పంట దిగుబడి  భారీగా పెరగడం వల్ల మార్కెట్ యార్డ్‌లకు పెద్ద ఎత్తున ఉల్లి తరలి వస్తోంది. నాసిక్‌లో రోజుకు 30 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డలు పోగవుతున్నాయి. వీటిని నిల్వ ఉంచడానికీ సరైన వసతులు లేవు. అందుకే రైతులు వచ్చిందే చాలు అనుకుని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. 


Also Read: United States of Kailasa: ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధి,స్వామి నిత్యానంద పోస్ట్‌లు వైరల్