ఉత్తర భారత దేశంలో చాలామందికి ఒక అలవాటు ఉంది. ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటికి వెళుతున్నప్పుడు, పెరుగులో పంచదార కలుపుకొని రెండు మూడు స్పూన్లు తిని అప్పుడు వెళతారు. అది శుభప్రదమైన ఆహారంగా వారు భావిస్తారు. అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం శివుడు ఇలా పంచదార కలిపిన పెరుగును ఇష్టపడతారని ఎంతోమంది నమ్మకం. మరికొందరికి దీని రుచి నచ్చుతుంది కాబట్టి, ప్రతిరోజూ భోజనం అయ్యాక పెరుగులో పంచదార కలుపుకొని తింటూ ఉంటారు. పెరుగు మంచిదే కానీ దాన్లో కలిపే పంచదార శరీరానికి ఆరోగ్యకరం కాదు. దీన్ని హిందీలో ‘దహీ శక్కర్’ అంటారు. ఈ కాంబినేషన్‌ను రోజూ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
బరువును పెంచుతుంది
పెరుగు - పంచదార కలిపి తినడం వల్ల క్యాలరీలు అధికంగా శరీరంలో చేరుతాయి. కొంతమందిలో ఇది విరేచనాలకు దారితీస్తుంది. చక్కెరను అధికంగా తినడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా అసమతుల్యతుకు దారితీస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. రోజు కప్పు పంచదార కలిపిన పెరుగు తినడం వల్ల మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. ఆకలి కూడా అధికం అయిపోతుంది.
డయాబెటిస్
వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కువ మందికి మధుమేహం వచ్చేస్తుంది. పెరుగు పంచదారను కలిపి తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం అధికమవుతుంది. పెరుగులో ఏమీ కలుపుకోకుండా తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.
దంతాలకు దెబ్బ
పంచదార కలపని పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా దంతాలకు మరీ మంచిది. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి ఉంటాయి. కానీ అదే పెరుగులో చక్కెరను కలపడం వల్ల నోటిలోని దంతాలకు సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా ఇలా పంచదార పెరుగు కలిపి తీసుకోవడం వల్ల దంత క్షయం వచ్చే అవకాశం ఉంటుంది. నోటిలో మిగిలిపోయిన చక్కెర... దంత ఫలకంలో ఉన్న బ్యాక్టీరియాతో కలిసి ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ యాసిడ్ దంతాలపై ఉన్న ఎనామెల్‌ను క్షీణించేలా చేసి, దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది.
విరేచనాలు
కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి పెరుగు, పాలు వంటివి అరగవు. ఇక పెరుగులో చక్కెరను కలపడం వల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగి పూర్తిగా అరగకపోవచ్చు. దీనివల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి పెరుగును తింటే మంచిదే కానీ, పంచదార కలపడం వల్ల ఆ ఫుడ్ కాంబినేషన్ ఆరోగ్యానికి హారికరంగా మారుతుంది.
Also read: వాల్‌నట్ ఆయిల్ గురించి తెలుసా? దీనిని రోజు వాడితే అందం - ఆరోగ్యం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.