వాల్‌నట్స్ చాలా ఖరీదైనవి. అందుకే వీటితో చేసే నూనె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో వాల్‌నట్ ఆయిల్ ను ఉపయోగించి వంటలు చేస్తారు. వాల్‌నట్ చెట్టు నుంచి వచ్చే గింజల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. ఈ నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ నూనెను రోజుకో స్పూన్ తాగినా కూడా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది. చర్మ సౌందర్యాన్ని కూడా ఇది పెంపొందిస్తుంది.
1. వాల్‌నట్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఈ ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఈ నూనె కాపాడుతుంది.
2. ఈ నూనెలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.
3. వాల్‌నట్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటతో, వాపుతో పోరాడే శక్తిని ఇస్తాయి. క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేయడంలో ఈ నూనె ముందుంటుంది.
4. ఈ నూనెలో విటమిన్ E అధికంగా ఉంటుంది. విటమిన్ E చర్మానికి అందాన్ని ఇవ్వడంలో సహకరిస్తుంది. ఈ ఆయిల్ వాడడం వల్ల ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ రెండు సమస్యల బారిన పడినవారు కూడా వాల్‌నట్ ఆయిల్ వాడడం వల్ల త్వరగా వాటినుంచి బయటపడవచ్చు.
5. ఇతర వంట నూనెలతో పోలిస్తే ఈ నూనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు వాల్‌నట్ ఆయిల్‌ను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
దీన్ని ఎలా వాడాలి?
ఈ ఆయిల్ ఖరీదైనది కాబట్టి సాధారణ నూనెల్లాగా ఎక్కువ వేసి కూరలు, బిర్యానీలు వండలేము. కాబట్టి దీన్ని కొన్ని రకాల పద్ధతుల్లో రోజుకో స్పూను లేదా రెండు స్పూన్లు శరీరంలోకి చేరేలా చేయవచ్చు.
1. సలాడ్ తినే అలవాటు ఉన్నవారు ఒక స్పూను వాల్‌నట్ ఆయిల్ ను డ్రెస్సింగ్ లాగా పైన చల్లుకోవాలి.
2. చికెన్, మటన్ వంటివి వండుతున్నప్పుడు మారినేట్ చేస్తారు. ఆ మారినేషన్ సమయంలో ఒక స్పూను వాల్‌నట్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. కేకులు వంటివి బేకింగ్ చేసేటప్పుడు వాల్‌నట్ ఆయిల్‌ను ఉపయోగించుకోవచ్చు. కేకు తయారు చేసే పిండిలో ఒక స్పూను లేదా రెండు స్పూన్ల వాల్‌నట్ ఆయిల్ వేసి బాగా కలిపి తర్వాత వాటితో మఫిన్లు, కేకులు, బ్రెడ్లు తయారు చేసుకోవాలి.
Also read: శరీరంలో ఐరన్ లోపిస్తే కనిపించే ముఖ్యమైన మూడు లక్షణాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.