వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ విషయాన్ని రాజకీయం చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి అన్నారు. హన్మకొండ జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. వివిధ అంశాల గురించి మాట్లాడుతూ.. ప్రీతి ప్రస్తావన కూడా తెచ్చారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరమని, కుటుంబానికి ప్రభుత్వం తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
నిందితులు ఎంతటివారైనా వదిలేదని లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఘటనకు కారణం సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలేదని లేదని హెచ్చరించారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధాకరమని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో 150 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 1.55 గంటలకు సోడాష పల్లిలోని రైతు వేదిక ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. మంత్రి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీపీ రంగనాథ్ ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే తాటికోండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్ లైన్ ద్వారా 3 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రూ.104 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలూరు మండల కేంద్రం వరకు 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం నారాయణగిరి నుంచి పీచురు వరకు రూ.10 కోట్లతో వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
పనికిమాలిన పాదయాత్రలు - కేటీఆర్
కొంత మంది రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ పార్టీకి 10 ఛాన్సులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్, నీళ్లు లేక తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యల చేసుకున్నారన్నారు. తెలంగాణలో అమాయకులు ఎవరూ లేరని కేటీఆర్ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏంచేశారని ప్రశ్నించారు. ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు ఎందుకు రాలేదన్నారు. కరెంట్, సాగు, తాగు నీరు ఇవ్వరు, ఇప్పుడేమో ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.