Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రముఖ 'టైమ్ మ్యాగజైన్' ఈ మేరకు కథనం ప్రచురించింది. ఆ ఇద్దరూ ఎవరంటే?
ఆ ఇద్దరు
భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజైన్ చెప్పుకొచ్చింది. ఆల్ట్ న్యూస్ సైట్‌కు ఫ్యాక్ట్ చెకర్స్‌గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. నార్వేజియన్ చట్ట సభ్యులు, బుక్‌మేకర్‌ల నుంచి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో (PRIO) ఆధారంగా రేసులో ప్రతీక్, జుబైర్ ప్రముఖంగా నిలిచినట్లు కథనంలో పేర్కొన్నారు.
ఇందులో మహ్మద్ జుబైర్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేసిన వ్యవహారంలో దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2018లో మహ్మద్ జుబైర్ చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జూన్ 27న జుబైర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.
ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబైర్‌నే. దీంతో ఆయన రెచ్చగొట్టే ట్వీట్స్ చేసినట్లు దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రజల్లో ద్వేషభావాన్ని పెంచేలా జుబైర్ ట్వీట్లు ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఐరాస స్పందన
జుబైర్ అరెస్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పాత్రికేయుల అరెస్టులపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్పందించింది. పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లకు అనుగుణంగా పాత్రికేయులను అరెస్ట్ చేయడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు జుబైర్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ సమాధానమిచ్చారు.
ఇంకెవరంటే
నోబెల్ శాంతి బహుమతి రేసులో జుబైర్, ప్రతీక్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావెల్నీ సహా పలువురు శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు కథనంలో తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు.
నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం మొత్తం 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకు గానీ తెలియజేయరు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి.
డిసెంబర్‌లో
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.
Also Read: Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా