Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

ABP Desam   |  Murali Krishna   |  05 Oct 2022 06:28 PM (IST)

Amit Shah Jammu Kashmir Visit: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

(Image Source: PTI)

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌ బారాముల్లాలో బుధవారం జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా  కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్‌తో చర్చలు జరిపే సమస్యే లేదన్నారు. 

1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. -                                                    అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

సహించేది లేదు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు. 

కశ్మీర్‌ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

కీలక హామీ

జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న అమిత్ షా.. గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందనున్నారు.

రాజౌరిలో మంగళవారం ఏర్పాటు చేసిన భాజపా ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌లోని సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందని అమిత్ షా అన్నారు.  కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

" ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదు. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారు. గతంలో రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్ముకశ్మీర్‌ను కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించేవి. ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్‌లకు న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన  30వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉంది. ఉగ్రవాదుల ఆగడాలను కట్టించేందుకు మోదీ తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే భద్రతా సిబ్బంది మరణాలు తగ్గుతున్నాయి. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య ఇప్పుడు 136కి తగ్గింది.                                             "

Published at: 05 Oct 2022 06:28 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.