First Target Karnataka : భారత రాష్ట్ర సమితి మొదటి టార్గెట్‌గా కర్ణాటకను ఎంపిక చేశారు కేసీఆర్. దీనికి కారణం ఉంది. వచ్చే ఏడాదే కర్ణాటకకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏడాది చివరిలో జరుగుతాయి. అంత కంటే ముందు కర్ణాటకలో జరుగుతాయి. అందుకే తెలంగాణ కంటే ముందే భారత రాష్ట్ర సమితిని కర్ణాటకలో అధికారంలోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం దేవేగౌడ పార్టీ జనతాదళ్ సెక్యూలర్‌తో కలిసి పోటీ చేయనున్నారు భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేసేందుకు కమారస్వామి సిద్ధంగా ఉన్నారు. ఆయన దేవేగౌడ కుటుంబం మొత్తం కలిసి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనకు వచ్చారు. 


జేడీఎస్‌తో కలిసి కర్ణాటకలో అధికారం పొందాలనే లక్ష్యంతో కేసీఆర్ 


కుమారస్వామి కుమారుడు .. సినీ హీరో అయిన నిఖిల్ గౌడ కూడా ప్రగతి భవన్‌లో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ స్వయంగా ఆయనకు టిఫిన్ వడ్డించారు. జేడీఎస్ ప్రతీ సారి కీలక పార్టీగా ఉంటోంది కానీ అధికారాన్ని పొందలేకపోతోంది. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి.. మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మధ్యలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో అధికారాన్ని కోల్పోయింది. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కూడా జేడీఎస్ నుంచి పలువురు నాయకులు నిష్క్రమించారు. అదే సమయంలో దేవేగౌడ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిపోయింది. కుటుంబ పార్టీ అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 


కర్ణాటకలో రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న జేడీఎస్ 


ఈ సవాళ్లను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ సారి నేరుగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ లేదా కాంగ్రెస్‌తో జత కట్టే పరిస్థితి లేదు. నిజానికి బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జేడీఎస్ ఉనికి తక్కువ.. జేడీఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఉనికి తక్కువ. ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు కుమారస్వామి. చివరికి ఆయన బీఆర్ఎస్‌తో కలిసి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.  జేడీఎస్‌ ఎమ్మెల్యేలు దేశమంతా కేసీఆర్‌తో కలిసి తిరుగుతారని కుమారస్వామి ప్రకటించారు.  


కేసీఆర్‌తో కలిసి దేశమంతా తిరుగుతామన్న కుమారస్వామి


తెలంగాణ పథకాలు బాగున్నాయన్న ఆయన.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్‌గా కేసీఆర్ కర్ణాటకను ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు బలమన ప్రాంతీయ పార్టీ మద్దతు లభించింది. ఇక బీఆర్ఎస్ కర్ణాటకలో అడుగు పెట్టినట్లే. ఆర్థిక వనరులను టీఆర్ఎస్ నేత సమకూరిస్తే.. కర్ణాటకలో సీట్ల గెలుపును జేడీఎస్ తమ భుజాల మీద వేసుకునే అవకాశం ఉంది.  మొత్తంగా  కేసీఆర్ కర్ణాటకపై మొదటిగా దృష్టి  సారించాలని నిర్ణయించడంతో అక్కడ  ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై ప్రభావం పడనుంది.