కొత్త వేతన చట్టం అమలుపై మరోసారి చర్చ
జులై 1వ తేదీ నుంచి కొత్త వేతన చట్టం అమల్లోకి రానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు
సమాచారం. ఒకవేళ ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే వేతనాల్లో భారీ మార్పులే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని గంటలు, జీతాల్లోసవరణలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ,ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్స్..ఇలా అన్నింటిలోనూ మార్పులు తప్పేలా లేదు. అయితే ఇప్పటికే చాలా సార్లు కొత్త వేతన చట్టంపై రూమర్స్ వినిపించాయి. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది అంటూ కొందరు హడావుడి చేశారు. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జులై1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రానుందంటూ ఇప్పుడు మరోసారి ప్రచారం జోరందుకుంది. ఇందులో వాస్తవమెంత అన్నది పక్కన పెడితే ఒకవేళ అనుకున్న విధంగా ఈ చట్టం అమలు చేస్తే ఏయే మార్పులు వస్తాయో ఓ సారి చూద్దాం.
కొత్త వేతన చట్టం అమల్లోకి వస్తే..
1. కొత్త వేజ్ కోడ్ అమలు చేస్తే ఇన్‌హ్యాండ్ శాలరీ తగ్గిపోతుంది. టేక్‌హోమ్ శాలరీ తగ్గిపోయి, పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం పెరిగే అవకాశముంది. ఓ ఉద్యోగి నెలవారీ సీటీసీలో కనీసం 50% మేర..బేసిక్ శాలరీగా ఉండాలని ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇది30-40%గా ఉంది
2. అలవెన్స్‌ల్లోనూ మార్పు వచ్చే అవకాశాలున్నాయి. నెలవారీ నెట్ సాలరీలో 50% కన్నా అధిక మొత్తాన్ని అలవెన్స్‌ల రూపంలో ఇవ్వటానికి వీల్లేదనే నిబంధన ఉన్నట్టు సమాచారం.
3. పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచి, దీర్ఘకాలంలో ఉద్యోగికే ప్రయోజనం కలిగించేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే కొత్త వేతనచట్టంలో భాగంగా పీఎఫ్ చెల్లింపుల మొత్తాన్ని పెంచుతారని తెలుస్తోంది.
4. ఈ కొత్త వేతన చట్టం ప్రకారం వారంలో 48 గంటలు కచ్చితంగా పని చేయాల్సిందే. రోజూ 12 గంటలు పాటు పని చేస్తే వారానికి మూడు రోజుల పాటు వీకాఫ్‌లు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రస్తుతానికి నెట్ సీటీసీ రూ. 50 వేలు ఉంటే అందులో రూ. 15 వేలు బేసిక్ కింద పరిగణిస్తున్నారు. ఈ ఆధారంగా బేసిక్‌లో 12% లెక్కించి నెల వారీగా రూ. 1800 పీఎఫ్ కింద డిడక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి వస్తే రూ. 50 వేల నెలవారీ సీటీసీలో రూ. 15-25వేల వరకూబేసిక్‌గా పరిగణిస్తారు. అదే 12శాతాన్ని పరిగణించి చూస్తే...నెలవారీ పీఎఫ్ చెల్లింపుల మొత్తం రూ. 3వేలకు పెరుగుతుంది. అంటే నెలవారీ సీటీసీలో దాదాపు రూ.1200 తగ్గిపోతాయన్నమాట. ఆ మేరకు టేక్‌హోమ్ సాలరీ తగ్గుతుంది. రిటైర్ అయిన సమయంలో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు ఈ కొత్త వేతన చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్‌లను తయారు చేశాయనీ అంటున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే గానీ ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చేట్టే లేదు.
Also Read: Electric Vehicles vs Fuel Vehicles: ఈవీల్లో కన్నా పెట్రో వాహనాల్లోనే ఎక్కువగా మంటలొస్తాయట, ఎందుకంటే?
Also Read: J&K - G-20 Summit: జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఆ సదస్సు, ఎందుకో తెలుసా?