Nepal Aircraft Crash:


బ్లాక్ బాక్స్ దొరికింది: నేపాల్ అధికారులు


నేపాల్‌ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఆధారాల కోసం వెతుకుతున్న అధికారులకు "Black Box" దొరికినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ 69 మంది మృతదేహాలను వెలికి తీశారు. స్పాట్‌లో కనిపించిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని స్పష్టం చేశారు. అయితే...ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపై ఇప్పటి వరకూ ఓ క్లారిటీ రాలేదు. ప్రాథమికంగా కొన్ని కారణాలను చెబుతున్నా...వాటిపైనా స్పష్టత లేదు. ఈ క్రమంలోనే బ్లాక్ బాక్స్‌ దొరకటం వల్ల అన్ని నిజాలూ వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇదెలా సాధ్యం..? ఫ్లైట్‌లో ఉన్న ఆ బ్లాక్‌ బాక్స్‌లో ఏముంటుంది..? ప్రమాదానికి కారణాలేంటో ఈ బాక్స్‌ ఎలా చెప్పగలుగుతుంది..? ఈ వివరాలు తెలుసుకుందాం. 






బ్లాక్ బాక్స్ (Black Box) అంటే ఏంటి..?


సాధారణంగా ఓ విమానంలో రెండు భారీ మెటల్ బాక్స్‌లు అమర్చుతారు. అందులో రికార్డర్‌లు ఉంచుతారు. ఈ రెండింటిలో ఒకటి ముందు భాగంలో మరోటి వెనక భాగంలో ఏర్పాటు చేస్తారు. విమానానికి సంబంధించిన వివరాలన్నీ ఈ రికార్డర్‌లు రికార్డ్ చేస్తాయి. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు...అందుకు కారణాలేంటో తెలుసుకోడానికి ఈ బాక్సులే సాక్ష్యాలుగా పని చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే...ఓ మర్డర్ జరిగి నప్పుడు పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తారు కదా. అదే విధంగా...ఎయిర్‌ క్రాఫ్ట్ ప్రమాదాల్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఈ బ్లాక్‌ బాక్సులు ఉపయోగపడతాయి. విమానం ముందు భాగంలో...అంటే కాక్‌పిట్‌లో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ (CVR)ను అమర్చుతారు. రేడియో ట్రాన్స్‌ మిషన్స్‌ను ఇది నమోదు చేస్తుంది. అంతే కాదు. కాక్‌పిట్‌లో ప్రతి చిన్న శబ్దమూ ఇందులో రికార్డ్ అవుతుంది. ఉదాహరణకు..పైలట్స్‌ మధ్య జరిగిన సంభాషణలు, ఇంజిన్ సౌండ్స్ లాంటివి. ఇక ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) దాదాపు 80 రకాల సమాచారాన్ని అందిస్తుంది. విమానం ఎంత ఎత్తులో ఉంది, ఎంత వేగంతో వెళ్తోంది,ఏ వైపు దూసుకెళ్తోంది, పిచ్‌, ఆటో పైలట్ స్టేటస్...ఇలా రకరకాల వివరాలు అందులో రికార్డ్అవుతాయి. అన్ని కమర్షియల్ ఫ్లైట్స్‌లలో ఈ బ్లాక్‌బాక్సులు తప్పకుండా ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వీటిని వెతికే పనిలో పడుతుందో ఓ టీం. దొరగ్గానే వెంటనే ప్రమాదానికి కారణాలేంటని ఆరా తీస్తారు. 


రంగు నలుపు కాదు..


పేరుకి బ్లాక్‌ బాక్స్‌లే కానీ...వీటి రంగు మాత్రం ఆరెంజ్‌ కలర్‌లో ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆ శిథిలాల్లో స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఇలా థిక్‌ కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. వీటికి బ్లాక్‌ బాక్స్‌లు అని పేరు ఎందుకు పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా...చాలా ప్రమాదాల్లో ఇవే కీలక ఆధారాలను అందించాయి. ఇప్పుడే కాదు. 1950ల నుంచే ఈ బాక్స్‌ల వినియోగం మొదలైంది. ఓ ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ డేవిడ్ వారెన్ వీటిని కనిపెట్టారు. మొదట్లో ఇందులో చాలా తక్కువ సమాచారం ఇందులో రికార్డ్ అయ్యేది. అప్పట్లో రికార్డింగ్‌ కోసం ఫాయిల్ లేదా వైర్ వినియోగించేవారు. తరవాత టెక్నాలజీ మారింది. మ్యాగ్నెటిక్ టేప్‌ వినియోగించడం మొదలు పెట్టారు. క్రమంగా...మరింత మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డర్లలో సాలిడ్ స్టేట్ మెమరీ చిప్స్‌ వినియోగిస్తున్నారు. ఈ రికార్డింగ్ డివైసెస్‌ బరువు ఎంతో తెలుసా..? దాదాపు 4.5 కిలోలు. ఎంత వేడి, చల్లని వాతావరణంలో అయినా తట్టుకుని నిలబడతాయివి. స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు. విమానం సముద్రంలో పడిపోయినా సరే ఈ బ్లాక్‌ బాక్స్‌లను సులువుగా కనుక్కోవచ్చు. ఇందులో ఉండే Beacon 30 రోజుల పాటు అల్ట్రా సౌండ్స్‌ సిగ్నల్స్‌ని ట్రాన్స్‌మిట్ చేస్తాయి. బ్లాక్‌ బాక్స్‌ల నుంచి డేటా రికవరీ చేసి అనలైజ్ చేసేందుకు కనీసం 10-15 రోజులు పడుతుంది. ఈ లోగా ఇతర సాక్ష్యాధారాల వేటలో పడతారు అధికారులు.  


Also Read: Asaduddin Owaisi: భారత్‌కు ప్రజాస్వామ్యాన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది ముస్లింలే - ఒవైసీ సంచలన వ్యాఖ్యలు