భారతీయ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిపై హాలీవుడ్ ప్రముఖ దర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా 'టైటానిక్', 'అవతార్' లాంటి విజువల్ వరండర్స్ సృష్టించిన జేమ్స్ కామెరూన్‌ తో జక్కన్న దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. అమెరికా లాస్ ఏంజిల్స్‌ లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌ వేడుకలో పాల్గొన్న ఆయన రాజమౌళితో 10 నిమిషాల పాటు మాట్లాడారు. తాను రెండుసార్లు ‘RRR’ సినిమా చూసినట్లు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులలో రాజమౌళి టాప్ లో ఉంటారని కామెరూన్ ప్రశంసించారు.


10 నిమిషాలు చర్చించడం నమ్మలేకపోతున్నా- రాజమౌళి


“గ్రేట్ జేమ్స్ కామెరూన్ ‘RRR’ చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతో భాగా నచ్చింది. అతడు తన భార్య సుజీని కూడా ఈ సినిమా చూడాలని చెప్పారు. అంతేకాదు, ఆమెతో కలిసి మళ్ళీ చూశారు. సార్! మీరు మా సినిమా గురించి విశ్లేషించడానికి  10 నిమిషాలు గడిపారు. నేను ఇంత సమయం మాకు ఇస్తారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు నేను ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాను. మీకు మీ సతీమణికి ధన్యవాదాలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు.






నా సంగీతం గురించి మాట్లాడారు- కీరవాణి


అటు ‘RRR’ సంగీత దర్శకుడు MM కీరవాణి సైతం జేమ్స్ కామెరూన్ గురించి ట్వీట్ చేశారు. "గ్రేట్ జేమ్స్ కామెరూన్ ‘RRR’ని రెండుసార్లు చూశారు. నా స్కోర్‌ పై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. !!! ఓషన్ ఫుల్ ఎక్సైట్‌మెంట్ గా ఫీలవుతున్నా" అని రాసుకొచ్చారు.






జేమ్స్ కామెరూన్ కు నచ్చిన ‘RRR’


అటు అమెరికన్ జర్నలిస్ట్ అన్నే థాంప్సన్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ‘RRR’ అవార్డు అందుకోవడం పట్ల అభినందనలు తెలిపారు. జేమ్స్ కామెరాన్.. Jr NTR, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ చాలా ఇష్టపడుతున్నట్లు చెప్పారు.






స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ ను కలిసిన రాజమౌళి, కీరవాణి


అటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో రాజమౌళి, కీరవాణి  ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ ను కలిశారు. ఆయనతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ''నేను ఇప్పుడే దేవుడిని కలిశా'' అని సోషల్ మీడియాలో ఎస్.ఎస్. రాజమౌళి ఒక పోస్ట్ చేశారు. 'నాటు నాటు...' పాట నచ్చిందని స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ చెప్పడం నమ్మలేకపోతున్నాని కీరవాణి ట్వీట్ చేశారు. 






రెండు విభాగాల్లో ‘RRR’కు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు


దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ సినిమా, తాజా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుకల్లోనూ దుమ్మురేపింది.  బెస్ట్ మ్యూజిక్ కేటగిరీతో పాటు, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీల్లో ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’లను దక్కించకుంది.