Nepal Aircraft Crash:


జనవరి 15 ఓ పీడకల..


నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినట్టు అధికారులు నిర్ధరించారు. ప్రమాద సమయంలో 72 మంది ఫ్లైట్‌లో ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్‌ను ఆపేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం, అంత మంది ప్రాణాలు కోల్పోవడం నేపాల్‌ను షాక్‌కు గురి చేసింది. నిజానికి...జనవరి పేరు వింటేనే ఆ దేశం భయపడుతుంది. ముఖ్యంగా జనవరి 15వ తేదీ అంటేనే
ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తేదీ కూడా అదే. ఎందుకిలా...? అంటే దానికి ఓ బలమైన రీజన్ ఉంది. 89 ఏళ్ల క్రితం ఇదే జనవరి 15వ తేదీన నేపాల్‌లో భారీ భూకంపం వచ్చింది. 1934లో సంభవించిన ఆ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో తెలుసా..? 11 వేల మంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రతత 8గా నమోదైంది. భారత్‌లోనూ కొన్ని చోట్ల అప్పట్లో ఈ ప్రభావం కనిపించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు పూర్తిగా ధ్వంసమైంది. బిహార్‌లోని మున్‌గర్, ముజఫర్‌పూర్‌ నగరాల్లోనూ తీవ్ర ప్రభావం పడింది. ఆ రోజు సరిగ్గా మధ్యాహ్నం 2.15 నిముషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది. దాదాపు 9.5 కిలోమీటర్ల లోతు మేర భూమి ఊగిపోయింది. టిబెట్ నుంచి ముంబయి వరకూ, 
అసోం నుంచి పంజాబ్‌ వరకూ అన్ని చోట్ల భూకంపం ఆస్తినష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు కూడా జనవరి 15న భారీ ప్రమాదం జరగటం 72 మంది ప్రయాణికులు చనిపోవడం ఆ దేశ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 


ఐదుగురు భారతీయులు మృతి


ఈ ఫ్లైట్‌లో మొత్తం 53 మంది నేపాలీలు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్‌లో 15 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులూ ఉన్నారు. 53 మంది నేపాలీలు, 5గురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లతో పాటు అర్జెంటీనాకు చెందిన ఓ ప్రయాణికుడూ ప్రమాద సమయంలో విమానంలోనే ఉన్నారు. ఐర్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రయాణికులూ మృతి చెందారు. ఇప్పటికే వెలికి తీసిన మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్నది పూర్తి స్థాయిలో ఇంకా తేలలేదు. కేవలం సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.  పొఖారా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే ముందు సేటి నది పక్కనే ఉన్న వాగులో కుప్ప కూలింది. టేకాఫ్ అయిన 20 నిముషాలకే ఈ ప్రమాదం సంభవించింది. సాధారణంగా ఖాట్మండు నుంచి పొఖారాకు రావడానికి 25 నిముషాలు పడుతుంది. సరిగ్గా పొఖారా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందు కుప్ప కూలింది. క్రాష్ అయిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు.  గతేడాది మే 29న కూడా నేపాల్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. తారా ఎయిర్‌ ప్లేన్ కుప్ప కూలిన ఘటనలో 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు