NEET Exam Cancelled: నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అప్పుడే ఏదీ తేల్చలేమని స్పష్టం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం వెనకడుగు వేయమని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడిస్తే అది విచారణపై ప్రభావం చూపించే అవకాశముందని తెలిపింది. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోగలమని వివరించింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తప్పుని కప్పిపుచ్చుకోవడం సరికాదనే ఉద్దేశంతోనే ఎగ్జామ్‌ని రద్దు చేశామని వెల్లడించింది. విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే పరీక్షను రద్దు చేశామని తెలిపారు. ఈ వివాదాన్ని CBIకి అప్పగించామని విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. 


"ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే చెప్పలేం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ప్రత్యేక వ్యవస్థ. దానికంటూ ఓ మెకానిజం ఉంది. దీనంతటిపైనా విచారణ కొనసాగుతోంది. CBI చేతికి ఈ కేసు వెళ్లింది. త్వరలోనే మరోసారి పరీక్ష నిర్వహిస్తాం. ఆ డేట్‌ని వెల్లడిస్తాం"


- గోవింద్ జైస్వాల్, జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ






మోదీ సర్కార్‌పై గరంగరం..


ఈ సారి OMR పద్ధతిలో ఎగ్జామ్ ఎందుకు పెట్టారన్న ప్రశ్నకి సమాధానమిచ్చారు గోవింద్ జైస్వాల్. అందరూ కలిసి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సారి నీట్‌ ఎగ్జామ్‌కి (Neet Exam 2024) సంబంధించి పలు సమస్యలు తలెత్తాయని, వాటిలో ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటున్నామని వివరించారు. ముందుగా గ్రేస్ మార్క్ గురించి చర్చ జరిగిందని, ఆ తరవాత పేపర్ లీకేజీ తెరపైకి వచ్చిందని అన్నారు. గుజరాత్‌లో మాల్‌ప్రాక్టీస్ జరిగిన విషయమూ తమ దృష్టికి వచ్చిందని తెలిపారు గోవింద్. ఎగ్జామ్ పేర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎగ్జామ్‌ని రద్దు చేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలూ ఇదే స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండి పడుతున్నాయి.నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు బయట పడుతున్నా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. 


Also Read: Viral Video: కానిస్టేబుల్‌కి వడదెబ్బ, హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా వీడియో తీసిన ఎస్సై! బాధితుడు మృతి