Kallakurichi Hooch Tragedy: తమిళనాడులో కల్తీ మద్యం వ్యవహారంలో మృతుల సంఖ్య 34కి చేరింది. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. CBCID ఇన్వెస్టిగేషన్ జరపాలని తేల్చి చెప్పారు. అటు అసెంబ్లీలోనూ ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజకీయంగానూ ఈ కేసు దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిక్కర్ అమ్మిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 200 లీటర్ల కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు.


ఈ మద్యం తాగిన వెంటనే విపరీతంగా వాంతులయ్యాయని, ఆ తరవాత కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారని చెప్పారు. ఈ కేసుపై విచారణ మొదలైంది. పరిమితికి మించి methanol కలపడం వల్లే మరణాలకు దారి తీసి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. ఎంత తాగొద్దని చెప్పినా మాట వినకుండా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా తమిళనాడులో ఇదే విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 






ప్రత్యేక కమిటీ..


ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి స్టాలిన్ విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీ వేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కల్లకురిచి జిల్లా ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక ఈ ఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తుల్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 


"కల్లకురిచిలో జరిగిన ఘటన చాలా బాధాకరం. నిందితులు అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యాన్ని విక్రయించకుండా అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్లపైనా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి ఘటనలు సమాజాన్ని ఆందోళనలోకి నెట్టేస్తాయి. ఇలాంటి వాళ్లను ఊరికే వదిలే ప్రసక్తే లేదు"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


 






Also Read: Neet Controversy 2024: అవును నీట్ పేపర్ నేనే లీక్ చేశా, విచారణలో అంగీకరించిన నిందితుడు