Neet Controversy Case: నీట్‌ వ్యవహారం విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ అయిన నలుగురు విద్యార్థులూ పేపర్ లీక్ అయినట్టు విచారణలో అంగీకరించారు. బిహార్ పోలీసులు ఇదే విషయం వెల్లడించారు. ఎగ్జామ్‌కి సరిగ్గా ముందు రోజు రాత్రే పేపర్ లీక్ అయిందని విద్యార్థులు ఒప్పుకున్నారు. అంతే కాదు. దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్ యాదవేందు కూడా తాను పేపర్ లీక్ చేసినట్టు అంగీకరించాడు. ఎగ్జామ్‌కి ముందు రోజే తమకు పేపర్ అందినట్టు మిగతా ముగ్గురు విద్యార్థులు చెప్పారు. అవే ప్రశ్నలు ఎగ్జామ్‌లో అడిగారనీ వివరించారు. ఈ మేరకు నిందితుడు తన నేరాన్ని అంగీకరిస్తూ లేఖ రాశాడు. ముందుగానే పేపర్ లీక్‌కి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు చెప్పాడు. అంతే కాదు. ఆన్సర్స్‌తో సహా పేపర్‌ని లీక్ చేసినట్టూ వివరించాడు. తన మామయ్యే ఈ పేపర్‌ లీక్‌కి సాయం చేశాడని పోలీసులకు వెల్లడించాడు. 






విచారణలో ఏం తేలిందంటే..?


కేసులో నిందితుడైన అమిత్ ఆనంద్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. పరీక్షకు ముందు రోజే ఆన్సర్స్‌తో సహా పేపర్ లీక్ అయిందని తెలిపాడు. ఆ రాత్రంతా సమాధానాల్నీ బట్టీ పట్టి తెల్లారి పరీక్ష రాసే విధంగా ప్లాన్ చేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేసినందుకు ఒక్కొక్కరి దగ్గర రూ.30-32 లక్షలు వసూలు చేశారు. తన ఫ్లాట్‌ నుంచే పేపర్‌ లీక్ చేసినట్టు ప్రధాన నిందితుడు ఒప్పుకున్నాడు. 


"దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న జూనియర్ ఇంజనీర్ సికందర్‌ని కలిశాను. ఆ సమయంలోనే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్‌నైనా లీక్ చేస్తానని చెప్పాను. అప్పటికే కొంత మంది విద్యార్థులు ఆయనను కలిసి ఎలాగోలా ఎగ్జామ్ పాస్ అయ్యేలా చూడాలని రిక్వెస్ట్ చేశారట. అందుకే పేపర్ లీక్ చేయాలంటే రూ.30-32 లక్షలు వసూలు చేస్తానని చెప్పాను. అందుకు సికందర్ ఒప్పుకున్నాడు. నలుగురు అభ్యర్థులతో పరిచయం చేయిస్తానని అన్నాడు"


- నిందితుడు 


ఇక ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. బిహార్ పోలీసులు ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్‌ ఎగ్జామ్‌లో అవకతవకలపై రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అటు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. మరి కొన్ని చోట్ల హైకోర్టుల్లోనూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే...ఈ ఎగ్జామ్‌ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్రాలకే అప్పగిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 


 


 






Also Read: Viral Video: బేటీ పడావో స్పెలింగ్‌ తప్పు రాసిన కేంద్రమంత్రి, కాంగ్రెస్ చురకలు - నెటిజన్ల సెటైర్లు