Heat Stroke: ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు ప్రజల్ని (Heat Waves) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని స్థాయిలో మరణాలూ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కానిస్టేబుల్ వడదెబ్బ తగిలి చనిపోయాడు. అంతకు ముందు తీసిన ఓ వీడియో సంచలనమవుతోంది. వేడిని తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఆ వ్యక్తికి సాయం అందించాల్సింది పోయి SI వీడియో తీశాడు. ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల చివరకు బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. ఆలస్యంగా హాస్పిటల్‌కి తీసుకెళ్లడం వల్లే బాధితుడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. అయితే...ఆ SI వీడియో తీశాడా..లేదంటే ఎవరికైనా వైద్య సాయం కోసం వీడియో కాల్ చేశాడా అన్నది క్లారిటీ లేదు. కానీ...సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. యూపీ అంతా ఇదే పరిస్థితి ఉంది. గంటల కొద్ది ఇలా పోలీసులు ఎండలో నిలబడలేక అల్లాడిపోతున్నారు. అలా నిలబడే ఓ కానిస్టేబుల్ ఎండ వేడి తగిలి మృతి చెందాడు. అయితే...వైద్యం అందించడంలో తాము నిర్లక్ష్యం వహించలేదని, వడదెబ్బ కారణంగానే చనిపోయాడని సీనియర్ అధికారులు తేల్చి చెబుతున్నారు.
ఇదీ జరిగింది..
రిజర్వ్ పోలీస్ లైన్స్‌కి చెందిన కానిస్టేబుల్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో డ్యూటీ చేసేందుకు వెళ్లాడు. స్టేషన్ గేట్‌కి చేరుకునే సమయానికే కళ్లు తిరిగాయి. ఎలాగోలా కష్టపడి దగ్గర్లోని షాప్ వరకూ వెళ్లాడు. అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. అక్కడి నుంచి పోలీస్ బూత్‌కి తీసుకెళ్లారు. అక్కడ SI నీళ్లు ఇచ్చి ఆ తరవాత CPR కూడా చేశాడని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాడని వివరించారు. ఉన్నట్టుండి ఎందుకిలా జరిగిందో ఆరా తీయడానికి మాత్రమే వీడియో తీశాడని చెప్పారు. తరవాత హాస్పిటల్‌కి తీసుకెళ్లాడని, కానీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని వెల్లడించారు. యూపీతో పాటు ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉక్కపోతకు అక్కడి ప్రజలు సతమతం అవుతున్నారు. నీటి కొరత కూడా వెంటాడుతోంది. వేడి గాలులకు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. వడ దెబ్బ మరణాలూ పెరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also Read: IIT Bombay: రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్, విద్యార్థులకు రూ.లక్ష జరిమానా విధించిన ఐఐటీ