Chhattisgarh Encounter: తుపాకుల మోతతో ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ-బీజాపూర్ జిల్లా సరిహద్దులోని లోహగావ్ పెడియా అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరికొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని లావా పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నక్సలైట్లకు చెందిన పీఎల్ జీఏ కంపెనీ నంబర్ 2తో సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు పది మంది నక్సలైట్లను సైనికులు హతమార్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఎస్‌ఎల్‌ఆర్‌, 303, 12 బోర్‌ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు.


మావోయిస్టుల కదలికలపై సమాచారం  
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరగడం గమనార్హం. సెప్టెంబరు 3, మంగళవారం, భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. పశ్చిమ బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసు అధికారులు తెలిపారు. దీని తరువాత, మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభం కాగా, రెండు వైపుల నుండి అడపాదడపా కాల్పులు జరిగాయి.


వారం క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు హతం
అంతకుముందు ఆగస్టు 29న నారాయణపూర్-కంకేర్ సరిహద్దులో 'యాంటీ నక్సల్' ఆపరేషన్ కింద నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ముగ్గురు నక్సలైట్లను హతమార్చాయి.


ఆపరేషన్ 'యాంటీ నక్సల్'  
ఆగస్టులో భద్రతా దళాలు, యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా  చాలా మంది నక్సలైట్లను పట్టుకుని చంపారు. ఆగస్టు ప్రారంభంలో కూడా దంతెవాడ పోలీసులు ఘనవిజయం సాధించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక హార్డ్‌కోర్ నక్సలైట్ హతమయ్యాడు. దీంతో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం సైనికులు వర్షాకాలంలో ఉప్పొంగుతున్న ఇంద్రావతి నదిని దాటి నక్సలైట్ల స్థావరాలకు చేరుకున్నారు. ఆ తర్వాత నక్సలైట్ల తాత్కాలిక స్థావరాలపై దాడులు జరిగాయి. అయితే దట్టమైన అడవిని సద్వినియోగం చేసుకొని పలువురు నక్సలైట్లు తప్పించుకున్నారు.


Also Read: PM Modi: రాజకీయాల్లో అది చాలా ముఖ్యం, లేదంటే మనకు తీవ్ర నష్టం - మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు


నక్సలైట్ల నిర్మూలనే లక్ష్యం
 కాగా, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలనకు స్థానిక బీజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత నాలుగు నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లే ​​ఇందుకు నిదర్శనం. గత నాలుగు నెలల్లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 150 మంది మావోయిస్టులు మరణించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించి మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని ప్రకటించారు.అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజులకే ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.