Latest News in Telugu: కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలకు పారదర్శకంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల విశ్వాసం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రాముఖ్యాన్ని వివరించారు. తన పాలనలో కమ్యూనికేషన్ కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న ఫేక్ సమాచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ప్రధాని తన మంత్రివర్గ సహచరులు సహా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాజకీయాల్లో కథనం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. చక్కగా తయారు చేసిన ఓ స్టోరీ ప్రజల అభిప్రాయాలను మార్చగలదని.. వారి ఆలోచనలను కూడా తారుమారు చేయగలదని మోదీ అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎన్నికల్లో మనకు తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ విధానాలను తరచూ ప్రతిపక్షం వ్యతిరేకిస్తుండడం, వాటిపై తప్పుడు కథనాలతో వారు ప్రజల్లోకి వెళ్లడం కారణంగా.. అది మన విధానాల ఉద్దేశం, వాటి ఫలితాలపై విపరీతమైన ప్రభావం చూపుతుందని మోదీ అన్నారు. కాబట్టి, ప్రభుత్వం చేపట్టే పనులకు సంబంధించి ప్రజల్లో మన పట్ల విశ్వాసాన్ని కలిగించేలా సమాచారాన్ని చేరవేయాలని పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు మోదీ పిలుపు ఇచ్చారు.