భారతీయ సినిమా పరిశ్రమలో రోజు రోజుకు సినిమాల నిర్మాణ బడ్జెట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్ అంటేనే వామ్మో అనే స్థాయి నుంచి ఇప్పుడు రూ. 500 కోట్లకు పైగా పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఆయా సినిమాల వసూళ్లు కూడా రూ. 1000 కోట్లకు మించి సాధిస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్ సైతం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు పలువురు హీరోలు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ సహా పలువురు హీరోలు ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో, వీరి తలదన్నేలా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఇంతకీ స్టార్ ఎవరో తెలుసా?


వరుసగా 7 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న హీరోగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నిలువబోతున్నారు. ఆయన నటించిన 7 చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత సంవత్సరం ఆయన నటించిన ‘లియో’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా వసూళు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి రూ. 600 కోట్లకు పైగా సాధించింది. ఇప్పుడు విజయ్ ప్రధాన పాత్రలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్‌) చిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్,  జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. AI సహాయంతో విజయకాంత్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.


రూ. 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న విజయ్


‘ది గోట్‌’ సినిమా సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆయన రెమ్యునరేషన్ ఎంతో నిర్మాత అర్చన కల్పాతి వెల్లడించారు. ఈ సినిమాలో నటనకు గాను విజయ్ కి రూ. 200 కోట్లు రెమ్యునరేషన్ అందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు భారత్ లో ఏ నటుడు తీసుకోనంత పారితోషికం కావడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్ లో అతడి సినిమాలు వరుసగా అద్భుత విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు అంత మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పినట్లు  అర్చన కల్పాతి చెప్పుకొచ్చారు.



సరికొత్త రికార్డు నెలకొల్పిన ‘ది గోట్‌’ ట్రైలర్


ఇక 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా ట్రైలర్ ఆగస్టు 17న విడుదలైంది.  ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 33 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంతేకాదు, 20 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తొలి తమిళ సినిమా ట్రైలర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 


Also Read: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్