Woman Attack on Her husbands Ear in Delhi: ఢిల్లీలోని సుల్తాన్ పురీ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇల్లు శుభ్రం చేయమన్నందుకు ఓ మహిళ తన భర్త చెవిని కొరికేసింది. ఈ మేరకు బాధితుడు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.


ఇదీ జరిగింది.


ఢిల్లీలోని సుల్తాన్ పురీ ప్రాంతంలో ఓ 45 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. కాగా, భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న తాను చెత్త బయటపడేసేందుకు వెళ్లి ఇల్లు శుభ్రం చేయమని చెప్పినందుకు తన భార్య తనతో గొడవపడి చెవి కొరికేసినట్లు బాధితుడు తెలిపాడు.


'ఈ నెల 20న ఉదయం 9:20 గంటలకు ఇంట్లోని చెత్తను పడేసేందుకు వెళ్లే ముందు నా భార్యను ఇల్లు శుభ్రం చేయమని అడిగాను. నేను చెత్త పడేసి వచ్చేసరికి ఆమె నాతో కావాలనే గొడవ పెట్టుకుంది. ఎందుకు గొడవ పడుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని, తాను పిల్లలతో వేరేగా ఉంటానని చెప్పింది. నేను నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాను. అయినా ఆమె వినలేదు. నాతో గొడవకు దిగింది. నాపై దాడి చేసేందుకు యత్నించింది. నేను ఆమెను నెట్టేశాను. ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఆమె వెనుక నుంచి వచ్చి నా మీద పడి కుడి చెవిని గట్టిగా కొరికింది. చెవి పైభాగం దెబ్బతినగా, నా కుమారుడు గమనించి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.' అని బాధితుడు వివరించాడు. 


పోలీసులకు ఫిర్యాదు


ఆస్పత్రిలో చేరిన బాధితునికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ దాడిపై పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి బాధితుని వద్ద వివరాలు సేకరించేందుకు యత్నించారు. అయితే, ఆ సమయంలో బాధితుడు మాట్లాడే స్థితిలో లేకపోవడంతో వెనుదిరిగారు. సర్జరీ పూర్తైన అనంతరం బాధితుడే స్వయంగా తన భార్యపై ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


మహారాష్ట్రలో భర్త ముఖంపై దాడి


అటు, మహారాష్ట్ర పుణేలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. తన పుట్టినరోజున భర్త దుబాయ్ కు తీసుకెళ్లలేదని ఓ మహిళ తన భర్త ముఖంపై దాడి చేయగా, అతను ప్రాణాలు కోల్పోయాడు. పుణెకు చెందిన నిఖిల్ ఖన్నా (38) వాన్ వాడియాలో వ్యాపారం చేస్తున్నారు. అతని భార్య రేణుక (36) పుట్టిన రోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా తనను దుబాయ్ తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. ఇందుకు ఆమె భర్త ససేమిరా అన్నాడు. అయితే, ఈ నెల 5న వారి వివాహ వార్షికోత్సవం జరగ్గా, బహుమతులిస్తాడేమోనని ఆశించి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకు వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఈ నెల 24న దీనిపై భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా, ఆవేశంతో అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో నిఖిల్ అపస్మారక స్థితికి వెళ్లగా, ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


Also Read: Citizenship Amendment Act: '2024 మార్చి నాటికి సీఏఏ తుది ముసాయిదా' - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు