Morbi Bridge Tragedy:
కోర్టులో విచారణ..
గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిపోయిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు విమర్శిస్తుంటే...ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ ముప్పు సంభవించిందని ఇంకొందరు మండి పడుతున్నారు. ఏదేమైనా...మొత్తానికి ఈ ఘటనపై సుప్రీం కోర్టు కూడా విచారణకు అంగీకరించింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సంస్థ మేనేజర్, తదితర సిబ్బందిని విచారిస్తున్నారు. లోకల్ కోర్ట్‌లో విచారణ కొనసాగుతుండగా...డిప్యుటీ ఎస్‌పీ కోర్టుకు ఓ కీలక విషయం వెల్లడించారు. వంతెన వైర్లు తుప్పుపట్టి పోయాయని, వాటిని రిపేర్ చేయించి ఉంటే ప్రమాదం జరిగుండేదే కాదని వివరించారు. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న మేనేజర్ దీపక్ పరేఖ్‌తో సహా 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ మేనేజర్‌ను విచారిస్తున్న సమయంలో కోర్టులో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది. "ఇలాంటి దుర్ఘటన జరగాలని దేవుడే కోరుకున్నాడేమో" అని ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వైర్లకు తుప్పు పట్టిందని, వాటికి కనీసం ఆయిల్ కూడా రాయలేదని డిప్యుటీ ఎస్‌పీ స్పష్టం చేశారు. నిందితులందరికీ10 రోజుల రిమాండ్ కోరిన డిప్యుటీ ఎస్‌పీ..కోర్టుకు మరి కొన్ని వివరాలు వెల్లడించారు.
డిప్యుటీ ఎస్‌పీ వివరణ..
"గాంధీ నగర్ టీమ్ అందించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే..అక్టోబర్ 26న ఈ వంతెనను పున:ప్రారంభించి నప్పుడు ఎంత కెపాసిటీని తట్టుకోగలదు అన్న వివరాలను యాజమాన్యం ఇవ్వలేదు. రీ ఓపెనింగ్‌కు ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోలేదు. లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో లేదు. లైఫ్‌గార్డ్స్ కూడా లేరు. కేవలం ప్లాట్‌ఫామ్ మాత్రమే మార్చారు. మిగతా పనులేవీ చేయలేదు" అని స్పష్టం చేశారు. యాజమాన్యం తరపున వాదించిన అడ్వకేట్ జీకే రావల్ తప్పంతా కాంట్రాక్టర్‌లదే అని కోర్టుకు తెలిపారు. వెల్డింగ్,
ఎలక్ట్రిక్ ఫిట్టింగ్ తదితర పనులన్నీ నాసిరకంగా చేశారని వెల్లడించారు. వారికి సరిపడా మెటీరియల్ అందించినప్పటికీ వాటిని సరైన విధంగా వినియోగించుకోలేదని చెప్పారు.
ఇందుకే కూలిందా..?
మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెనది 140 ఏళ్ల చరిత్ర. గుజరాత్‌లో అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణల్లో ఇదీ ఒకటి. రోజూ వందలాది మంది వచ్చి ఈ బ్రిడ్జ్‌ను సందర్శిస్తుంటారు. రిషికేష్‌లోని రామ్, లక్ష్మణ్ ఊయల వంతెనను పోలి ఉండటం వల్ల చాలా మంది దీన్ని చూసేందుకు వస్తుంటారు. ఒక్కోసారి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆదివారం కావటం వల్ల నిన్న ఎక్కువ మంది వచ్చారు. వందల మంది వంతెనపైకి ఎక్కారు. కెపాసిటీకి మించి పోవటం వల్ల ఉన్నట్టుండి అది కూలిపోయింది. వంతెనపై ఉన్న వాళ్లంతా నదిలో పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా...కొందరు మాత్రం గల్లంతయ్యారు. Oreva Group ఈ బ్రిడ్డ్ మెయింటేనెన్స్ చూసుకుంటోంది. మోర్బి మున్సిపాలిటీతో ఈ సంస్థ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నుంచి 2037 వరకూ 15 ఏళ్ల పాటు మెయింటేన్ చేసేలా అగ్రిమెంట్ కుదిరింది.
Also Read: Munugodu Effect : మునుగోడు ఫలితం రాజకీయాన్ని ఎలా మారుస్తుంది ? ఎవరు గెలిస్తే ఏం చేస్తారు ?