ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ చిన్న వివాదంలో భార్య సహా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బర్హాల్ అనే వ్యక్తి భార్య తృటిలో తప్పించుకుంది. అయితే అగ్ని ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. గాయపడిన చిన్నారులను గ్రామస్తులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తర్వాత నిందితుడైన భర్తపై భార్య మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


బిజ్నోర్ పోలీస్ స్టేషన్ కొత్వాలి నగరంలోని గోపాల్‌పూర్ నివాసి అరుణ్ కుమార్ డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అరుణ్ కుమార్ కుమారుడు ఆరవ్ పుట్టినరోజు అక్టోబర్ 30. తన పుట్టిన రోజు సందర్భంగా అరుణ్ కుమార్ గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు చిన్నారి పుట్టినరోజు పార్టీని ఇచ్చాడు. ఈ విందుకు హాజరైన వారికి ఆహారం సరిపోలేదు. ఇంకా తినాల్సిన అతిథులు ఉండగానే ఆహారం అయిపోయింది. దీంతో అరుణ్, వందన ఒకరితో ఒకరు గొడవ పడ్డారు, దాని వల్ల అరుణ్ కోపంతో అతని భార్య వందన, ఆమె ఇద్దరు అమాయక పిల్లలు ఆరవ్, ఊర్వశిపై మోటారు సైకిల్ నుండి పెట్రోల్ తీసి, వారిపై పోసి తగులబెట్టాడు. 


అయితే ఈ ప్రమాదంలో పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, గాయపడిన భార్య వందన తన భర్తను దూషించింది. ఆహారం అయిపోవడంపై ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందని చెప్పింది. ఈ క్రమంలోనే పెట్రోల్ పోసి భర్త ఈ ఘటనకు పాల్పడ్డాడు. వందన గర్భవతి కావడంతో పిల్లలిద్దరితో తప్పించుకోలేకపోయింది. దీంతో పిల్లలిద్దరికీ తీవ్ర కాలిన గాయాలయ్యాయి.ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. నిందితుడు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త ఉదంతం వెలుగులోకి వచ్చిందని నగర ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు. నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.


సమాజ్ వాదీ పార్టీ నేత, కుటుంబం దారుణ హత్య


మరోవైపు, ఉత్తర ప్రదేశ్‌లోని సతారా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని భార్య, తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బడౌన్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సమాజ్ వాదీ పార్టీ మాజీ బ్లాక్ చీఫ్ రాకేష్ గుప్తా (58), అతని భార్య శారదాదేవి (54). తల్లి శాంతిదేవి (80)లను సోమవారం హత్య చేశారు. ఈ హత్యలపై సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమాచారం అందినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) ఓపీ సింగ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి గుప్తా ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి చొరబడినట్టు చెప్పారు. గుప్తా పైన, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరిని ఆగంతకులు కాల్చి చంపిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను సమాజ్‌వాదీ పార్టీ తప్పు పట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.