Munugodu Effect : తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలు జరగాల్సింది రాజ్యాంగపరంగానే. అంతకు ముందు ఎన్నికలు రావొచ్చు కూడా. రాకపోవచ్చు కూడా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయాలన్నీ.. మునుగోడు ఉపఎన్నిక ఫలితంపైనే ఆధారపడి ఉంటాయి. టీఆర్ఎస్ గెలిస్తే ఓ రకమైన రాజకీయం ఉంటుంది. బీజేపీ గెలిస్తే మరో రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదే గుర్రం ఎగరా వచ్చన్నట్లుగా కాంగ్రెస్ గెలిస్తే.. సరికొత్త సమీకరణాలు ఏర్పడతాయి. అందుకే..ఇప్పటి వరకూ జరిగిన రాజకీయం ఒకటి.. మునుగోడు ఎన్నికల తర్వాత జరగబోయే రాజకీయం మరొకటని అనుకోవాలి.
మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ?
మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచి తీరుతామని చండూరు సభలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలిస్తే ఎన్ని కష్టాలు వస్తాయో ప్రజలకు ఏకరవు పెట్టారు. బాయి కాడ కరెంట్ మీటర్ దగర్నుంచి చేనేతపై జీఎస్టీ వరకూ చాలా చెప్పారు. ఆ మాటలన్నీ అన్ని వర్గాలు చెవికెక్కించుకుంటే బీజేపీ గెలవదు. టీఆర్ఎస్సే గెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా తమకే ఓటేస్తారని టీఆర్ఎస్ నమ్మకం. మరి ఎనిమిదేళ్లుగా మునుగోడుకు టీఆర్ఎస్ ఏం చేసింది.. కనీసం రోడ్లు కూడా లేవు కదా అని వచ్చిన ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా కేసీఆర్ పదిహేను రోజుల్లో రోడ్లేస్తానన్నారు. ఇలాంటి హామీలు గతంలో కేసీఆర్ చాలా ఇచ్చారు. ఏది వర్కవుట్ అయినా టీఆర్ఎస్ గెలిస్తే.. ఆ పార్టీకి ఆ ఊపును జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది. బీజేపీపై పోరును మరింత ఉద్ధృతం చేస్తుంది. బీఆర్ఎస్ కోసం మరింతగా సన్నాహాలు చేసుకుంటుంది. ఓ రకంగా టీఆర్ఎస్ జాతీయ స్థాయికి వెళ్లడానికి మునుగోడులో రోడ్ మ్యాప్ తయారైనట్లుగా ఉంటుంది. ముందస్తుకు వెళ్లే ఆలోచన చేయకుండా.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.
బీజేపీ గెలిస్తే రచ్చ రచ్చే..!
చండూరు సభలో కేసీఆర్ ఓ మాట అన్నారు.. అదేమిటంటే " బీజేపీకి డిపాజిట్ వస్తే ప్రభుత్వాన్ని పడగొడతారు" అని. అయితే బీజేపీకి డిపాజిట్ వస్తేనే అంత పని చేయగలిగే స్థితికి వెళ్తే ఇక గెలిస్తే ఏం చేస్తుందో చెప్పడం కష్టం. తెలంగాణ బీజేపీ నేతలు .. కేసీఆర్ వ్యూహాలపై ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు అంత కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణలో సీన్ మారిపోతుంది . టీఆర్ఎస్ నుంచి వలసల్ని ఆపడం అంత తేలిక కాదు. రూ. వంద కోట్లకు అమ్ముడుపోయారనే విమర్శలు వచ్చినా ఎక్కువ మంది జంప్ అయ్యేందుకు చాన్స్ ఉంది. ఎందుకంటే.. మునుగోడు గెలుపుతో బీజేపీకి వచ్చే మైలేజ్..మాత్రమే కాదు..కేసీఆర్‌ను ఢిల్లీ పాలకులు అలాగే టార్గెట్ చేస్తారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్‌లో అంతర్గతంగా సమస్యలు పెరుగుతాయి. బీజేపీ వీలైనంత డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగిదే ... ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలను తోసి పుచ్చలేం.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ?
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. కానీ ఆ పార్టీ ధనబలంతో పోటీ పడలేకపోయింది. క్యాడర్ అంతా.. లెక్కలు తీసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. కానీ రేవంత్ రెడ్డి మహిళా సెంటిమెంట్ ప్రయోగించారు. తెలంగాణ సెంటిమెంట్ కూడా వాడారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆడబిడ్డ అనే సానుభూతి ఓట్ల వర్షాన్ని సైలెంట్‌గా కురిపిస్తే.. సంచలనం సృష్టించవచ్చు. అదే జరిగితే.. ఉపఎన్నిక మోటో మొత్తం టీఆర్ఎస్, బీజేపీలకు రివర్స్ అవుతుంది. ఒక్క సారిగా తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయం చేసుకోవచ్చు.
అయితే మునుగోడు పెద్ద ఎన్నిక కాదని.. అన్నింటి లాంటి ఉపఎన్నికేనని..ఆ ఎన్నిక ఫలితంతో వచ్చేది.. పోయేది ఏమీ ఉండదని కేటీఆర్ తరచూ చెబుతూంటారు. కానీ ఎన్నికల వేడి తెలంగాణ రాజకీయాల్ని ఆవహించేసిన తర్వాత.. ఇంత తేలిగ్గా తీసుకోవడానికిలేదన్న వాదన మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఏం జరుగుతుందో అనేది .. కౌంటింగ్ తర్వాతనే తెలుస్తుంది.