Monkeypox Cases India: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు కూడా నమోదైంది. జులై 6న యూఏఈ నుంచి మలప్పురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్‌ను గుర్తించినట్లు కేరళ సర్కార్ ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


కేరళలోనే


మంకీపాక్స్ కేసులు మూడూ కేరళలోనే నమోదయ్యాయి. తాజాగా 35 ఏళ్ల వ్య‌క్తికి ఈ వైరస్ సోకింది. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న అత‌డ్ని మాన్‌జెర్రీ మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు.






జులై 13న ఆసుపత్రిలో చేరిన ఆ వ్య‌క్తిలో 15వ తేదీ నుంచి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ట్లు కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉన్న‌వారిని, కుటుంబ‌స‌భ్యుల్ని అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. 


డబ్ల్యూహెచ్ఓ


మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఆఫ్రికాలో ఐదుగురు ఈ వైరస్ కారణంగా మృతి చెందినట్లు వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.


లక్షణాలు ఎలా ఉంటాయి?


మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమ దేశాల్లో, మధ్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 


1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట


అమ్మవారిలాగే...


చికెన్ పాక్స్‌ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.


Also Read: ABP Network Cameraman Injured: అమృత్‌సర్ ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండగా ABP కెమెరామెన్‌కు బుల్లెట్ గాయం


Also Read: African Swine Fever In Kerala: కేరళకు ఏమైంది? తాజాగా మరో వ్యాధి - 300 పందులను చంపేయాలని ఆదేశం!