Ratan Tata Death News:  ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందన్నారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా రతన్ టాటా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అందించిన  సేవలు చిరస్మరణీయమని అన్నారు రేవంత్. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. 




ప్రపంచంపై చెరగని ముద్రవేసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారని అలాంటి వారిలో రతన్ టాటా ఒకరని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. "దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన రతన్ టాటా మాదిరి వాళ్లు తక్కువ మందే ఉంటారు. ఇవాళ మనం కేవలం ఒక వ్యాపార దిగ్గజాన్నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయాం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన కృషి, దాతృత్వం భావి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సహకారం ఎప్పటికీ గుర్తుంటుంది. అని చంద్రబాబు సంతాప సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. 




దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమించారని తెలిసి ఆవేదనకు లోనయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. "భారత పారిశ్రామిక రంగానికి దీప శిఖల్లాంటి సంస్థల్లో ఒకటి టాటా గ్రూప్. ఈ పారిశ్రామిక సంస్థను రూ.10 వేల కోట్ల స్థాయి నుంచి రూ.లక్షల కోట్ల స్థాయికి చేర్చిన రతన్ టాటా దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. ఆయన యువతలో ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. స్టార్టప్ సంస్థలకు అండగా నిలిచారు. 




తన సంపదలో ఎక్కువగా భాగం దాతృత్వ కార్యక్రమాలకే కేటాయించిన దాన శీలి. కోవిడ్ విపత్కర సమయంలో రూ.1500 కోట్లు విరాళం ప్రకటించి దాన గుణాన్ని చాటారు. పారిశ్రామిక రంగంతోపాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రతన్ టాటా నవ తరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయులు. అని ప్రకటనలో తెలిపారు పవన్ కల్యాణ్


ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని కేసీఆర్ అన్నారు. సమాజహితుడుగా తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.  అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామికవేత్తగా అభివర్ణించారు. 




సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై పాలన దార్శనిక కార్యాచరణపై ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ గుర్తు చేశారు. మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని అన్నారు.