తెలంగాణ - చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో బలగాలు "ఆపరేషన్ హిడ్మా"ను జోరుగా కొనసాగిస్తున్నాయి. బలగాలకు మావోయిస్టు మోస్ట్ వాటెండ్‌గా మాడ్వీ హిడ్మా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందేందుకు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి హిడ్మా వచ్చారని స్పష్టమైన సమాచారం ఉండటంతో అడవులను జల్లెడ పడుతున్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
Also Read : ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యహం !
హిడ్మాపై స్లో పాయిజన్ ద్వారా విష ప్రయోగం జరిగిందని వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్నివర్గాలు... ఆర్కే మృతికి కారణాలను ఆరా తీసేందుకు వచ్చాడని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. పలిమెల, మహాదేవపూర్, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎల్‌జీఏ నేత కావడంతో హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు.
Also Read : అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..
మరోవైపు హిడ్మా తన బృందంతో భూపాలపల్లి, ములుగు జిల్లా సమీపంలో గోదావరితీరం దాటి ఉండొచ్చనే అనుమానాలు పోలీసు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహదేవపూర్-ఏటూరునాగారం ఏరియా కమిటీ హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. వైద్యం కోసం వచ్చి ఉంటే ఆస్పత్రుల్లో పట్టుకోవచ్చని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు.
మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా దళంలోని కొందరు వ్యక్తులు స్లోపాయిజన్ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కూడా కొవిడ్ నుంచి కోలుకున్నా తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారు. స్లో పాయిజన్ ద్వారా విషప్రయోగం చేయడం వల్ల మెల్లగా శరీర భాగాలపై ప్రభావం చూపించిందని అనుమానిస్తున్నారు. ఉన్నట్లుంగా నరాల బలహీనత సమస్య ఆర్కేను తీవ్రంగా వేధించిందని సమాచారం. హిడ్మాలో కూడా క్రమంగా ఇలాంటి లక్షణాలే బయట పడుతున్నాయని.. దాతో విష ప్రయోగం జరిగిందన్న అనుమానంతో వైద్యం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ- చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాల్లో టెన్షన్ వాతారణం కనిపిస్తోంది.