అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతితో ఆంధ్రా - ఒరిస్సా బోర్డర్ ( ఏవోబీ )లో మావోయిస్టులు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మావోయిస్టులకు సంబంధించి నాలుగైదు ప్రధాన కార్యక్షేత్రాలు ఉంటాయి. నల్లమల, దండకారణ్యం, జంగల్ మహాల్, ఏవోబీ అలాంటి వాటిలో ముఖ్యమైనవి. కేంద్ర కమిటీ ఆయా ప్రాంతాలకు ఒక్కో కార్యదర్శిని నియమిస్తుంది. ఆయా ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలపడేలా చేయడం.. ఓ రకంగా సమాంతర పాలన చేయడానికి ఆ కార్యదర్శి బాధ్యతలు ఉంటాయి. కేంద్ర కమిటీ సభ్యునిగా.. పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఏవోబీ బాధ్యతల్ని ఆర్కే పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఏవోబీలో మావోయిస్టుల పరిస్థితి ఏమిటి అన్న చర్చ ప్రారంభమైంది. ఇక అక్కడ వారి ఉనికి ఉండదని పోలీసులు భావిస్తున్నారు.. కానీ మరో కీలకమైన నేతకు బాధ్యతలు ఇచ్చేందుకు కేంద్ర కమిటీ ప్రయత్నిస్తోందన్న సమాచారం వారికి ఉంది.
Also Read : అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..
ప్రస్తుతం ఏవోబీలో గణేష్ నాయకత్వం!
ప్రస్తుతం ఆంధ్రా-ఒడిసా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటికి గణేశ్ నాయకత్వం వహిస్తున్నారు. 2004లో ఏపీ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో గణేశ్ కూడా పాల్గొన్నారు. గణేష్ కన్నా ముందు పద్మక్క కార్యదర్శిగా ఉన్నారు. 2016లో రామ్‌గూడ ఎన్‌కౌంటర్ తర్వాత ఆమెను ఒడిషా కమిటీకి పంపించి గణేష్‌ను నియమించారు. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉంటూ ఏవోబీ కమిటీకి ఎప్పటికప్పుడు ఆర్కే దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ప్రత్యేకమైన వ్యూహకర్తగా పేరున్న ఆర్కే ఏవోబీలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆయన ఇప్పుడు లేకపోవడంతో మరోసారి ఏవోబీలో మావోయిస్టు ఉద్యమంపై నీలి నీడలు ప్రారంభమయ్యాయి.
ఆర్కే వ్యూహాల కారణంగానే ఏవోబీలో బలపడిన మావోయిస్టులు !
ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం అంటే నల్లమల, దండకారణ్యం, జంగల్ మహాల్‌లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఆర్కే ఏవోబీని కూడా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంగా మార్చేశారు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా.. ప్రభుత్వంతో చర్చల కోసం బయటకు వచ్చి తన ఉనికిని బయటకు తెలిసేలా చేసినా ఏఓబీ పరిధిలో మావోయిస్టు పార్టీ నిర్మాణం, విస్తరణ, దాడుల వ్యూహాలను అమలు చేశారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రామగూడ ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడినా, తన కుమారుడు మున్నాను కోల్పోయినా.. మరో జోన్‌కు వెళ్లకుండా ఏవోబీ కేంద్రంగానే పనిచేస్తూ తన అంకురిత దీక్షతను చాటిచెప్పారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆర్కే స్థానంలో సుధాకర్‌కు బాధ్యతలు ఇస్తారా ?
ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులు.పాలిట్ బ్యూరోలోనూ సభ్యులుగా ఉన్న సుధాకర్‌కు ఆర్కే బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఛత్తీస్‌ఘఢ్ - ఒడిషా కమిటీతోపాటు మిలిటరీ కమిషన్ వ్యవహారాల్లో పనిచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ కూడా ఒక ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన ఎలా ఉంటారో చర్చల సమయంలో బయట ప్రపంచానికి తెలిసింది. కానీ ఆ తర్వాత సుధాకర్ గురించి సమాచారం బయటకు రాలేదు. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయినా.. అరెస్ట్ అయిన సందర్భంలోనూ సుధాకర్ ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరించలేకపోయారు. బెంగాల్లో ఉన్నారని కొందరు, ఈశాన్య రాష్ట్రాల్లో మరి కొందరు చెప్పారు కానీ అంతకు మించిన సమాచారం ఇవ్వలేకపోయారు. 2017లో కోరాపుట్ ఏరియాలో పోలీసులు చుట్టుముట్టినప్పుడు తప్పించుకున్నారన్న సమాచారం మాత్రం ఉంది. గత రెండేళ్లుగా ఆయన దండకారణ్యంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. నాయకత్వ మార్పు జరిగి గణపతి స్థానంలో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాక సుధాకర్‌కు దండకారణ్యంకు తీసుకొచ్చి.. మిలటరీ కమిషన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి దండకారణ్యంతోపాటు ఏవోబీ కూడా కీలకమైనది. ఆర్కే మరణంతో ఏవోబీలో పార్టీపై తప్పక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీన్ని కొంతయిన తగ్గించుకునేందుకు సుధాకర్ నే కేంద్ర కమిటీ నుంచి ఏవోబీ పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారని భావిస్తున్నారు.
Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ
గతంలో ఏవోబీ కార్యదర్శిగా పని చేసిన సుధాకర్ !
1998 నుంచి 2004 వరకు ఆయనకు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం సుధాకర్‌కు ఉంది. ఈ నేపధ్యంలో ఆర్కే స్థానాన్ని సుధాకర్ తో భర్తీచేస్తారని చెబుతున్నారు. మావోయిస్టు ఏరివేత వ్యవహారాలను సుదీర్ఘకాలం నుంచి పరిశీలిస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే వ్యూహాలు చెబుతారు. కిందిస్థాయి కమిటీలు, వారి స్క్వాడ్లు వాటిని అమలు చేస్తాయి. ఇప్పుడూ ఆ స్థాయి నాయకుడినే కేంద్ర కమిటీ తరపున ఏవోబీకి పంపిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏవోబీలోసరిగ్గా 100 మంది కూడా లేరని ... ఈ పరిస్థితుల్లో కాస్త ఈ ప్రాంతంపై పట్టున్న సుధాకర్ నే పంపిస్తారని అంచనావేస్తున్నామన్నారు. గణేశ్, పద్మక్కలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగానే ఉన్నారు. వీరిలో సుధాకర్ సీనియర్. అందుకే ఆయనకే బాధ్యతలు ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read : ఆర్కేకు లాల్ సలాం ! అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి