Marital Rape | ‘‘పెళ్లంటే.. భార్యపై క్రూరత్వాన్ని చూపేందుకు లైసెన్స్ కాదు. బలవంతంగా సెక్స్ చేస్తే అది అత్యాచారమే. అది భర్త చేసినా, మరే వ్యక్తి చేసినా దాన్ని రేప్‌గానే పరిగణించాలి’’ అని కర్ణాటక హైకోర్టు మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భార్యను ‘సెక్స్ బానిస’గా బలవంతం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తపై అత్యాచారం ఆరోపణలను కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు బుధవారం నిరాకరించింది.
న్యాయమూర్తి ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ విచారణ ప్రకారం.. భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించేందుకు పురుష హక్కు లేదా అనుమతిని మంజూరు చేయడానికి వివాహ వ్యవస్థను ఉపయోగించలేమని స్పష్టం చేశారు. ‘‘చట్టం ప్రకారం భర్త అయినప్పటికీ, ఆమె సమ్మతికి విరుద్ధంగా భార్యపై లైంగిక వేధింపులు, క్రూరమైన చర్యలకు పాల్పడితే అత్యాచారంగా పేర్కొనలేం. కానీ, భర్త తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడితే భార్య యొక్క మానసిక స్థితిపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అది ఆమెపై మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది’’ అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెళ్లయినప్పటి నుంచి తన భర్త తనను ‘సెక్స్ బానిస’గా పరిగణిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం కర్ణాటక హైకోర్టు విచారించింది. కుమార్తె ముందే భర్త తనతో అసహజ సెక్స్‌లో పాల్గొనాలని బలవంతం చేశాడని, అతడు ‘అమానవీయుడు’ అని పేర్కొంది. దీంతో కోర్టు అది క్రూరమైన చర్య అని, అలాంటి చర్యకు వివాహం లైసెన్స్ కాకూడదని కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా కోర్టు బాధితురాలు, ఆమె బిడ్డను శారీరకంగా, మానసికంగా హింసించిన నేపథ్యంలో ఆమె భర్తపై సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష) 498A (భార్య పట్ల క్రూరత్వం) 323 (శిక్ష) కింద శిక్షార్హమైన నేరాలను మోపింది. భారతీయ శిక్షాస్మృతి (IPC) 377 (అసహజ నేరాలు), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 (POCSO)లోని సెక్షన్ 10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), IPC సెక్షన్ 376 (రేప్), 498A మరియు 506, సెక్షన్ 5(m), (l) సెక్షన్ 6తో పాటు POCSO చట్టం కింద శిక్షార్హమైన నేరాలకు పిటిషనర్ భర్తపై ప్రత్యేక కోర్టు అభియోగాలు మోపడం గమనార్హం.
ఈ సందర్బంగా కోర్టు IPC సెక్షన్ 375లోని మినహాయింపులోని లోపాలను ఎత్తి చూపింది. పురుషుడు స్త్రీని బలవంతం చేయడం అత్యాచారమేనని, అది భర్తైనా, వేరే పురుషుడైనా సమానమేనని పేర్కొంది. ఆమె భర్తపై అత్యాచార ఆరోపణలను సమర్దించింది. ఎన్నాళ్ల నుంచో ఈ ఆరోపణలు వస్తున్నా.. మన దేశంలో వైవాహిక అత్యాచారం క్రిమినల్ నేరం కాదని పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించాలా వద్దా అనే విషయం గురించి తాము మాట్లాడటం లేదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. దీనిని శాసనసభ పరిగణలోకి తీసుకోవాలని కోరింది. చట్టంలో ఇటువంటి అసమానతల ఉనికి గురించి చట్ట నిర్మాతలు ఆలోచించాలని కోరింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, సోవియట్ యూనియన్, పోలాండ్ మరియు చెకోస్లోవేకియా తదితర దేశాలలో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధమని కోర్టు ఎత్తి చూపింది.