Mark Zuckerberg: 


వచ్చే ఏడాదికి మరో కూతురు..


ఫేస్‌బుక్‌ కో ఫౌండర్ మార్క్‌ జుకర్‌బర్గ్ మూడో సారి తండ్రి కానున్నారు. ఈ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన సతీమణి ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు. "మ్యాక్స్, ఆగస్ట్‌కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోంది" అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2012లో ప్రిసిల్లా చాన్‌ను పెళ్లి చేసుకున్నారు జుకర్‌బర్గ్. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట. వాళ్ల పేర్లు మ్యాక్సిమా, ఆగస్ట్. ఇప్పుడు మూడోసారి కూడా కూతురు పుడుతున్నట్టు ప్రకటించారు జుకర్. అమెరికాలో పిల్లలు పుట్టక ముందే లింగనిర్ధరణ చేసుకోవచ్చు. అక్కడ అదేమీ నేరం కాదు. వీళ్లిద్దరూ కాలేజ్‌లో ఉండగానే ప్రేమలో పడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట...2012లో పెళ్లి చేసుకుంది. ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. 






కరిగిపోయిన సంపద..


ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న జుకర్...ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడ్డారు. మెటా ప్లాట్‌ఫామ్స్‌కి సీఈవోగా ఉన్న జుకర్...దాదాపు 68.3 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. సంపదలో 54% మేర కరిగిపోయింది. ఈ ఏడాది మరీ దారుణంగా...సగానికి సగం పడిపోయింది. 71 బిలియన్ డాలర్ల మేర కోత పడింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) లోనూ వెనకబడ్డారు జుకర్‌బర్గ్. 2014 నుంచి చూస్తే...ఈ సారి 55.9 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో 20 స్థానానికి పడిపోయారు. రెండేళ్ల క్రితం జుకర్ సంపద 106 బిలియన్ డాలర్లు. ఆ సమయానికి జెఫ్ బెజోస్, జుకర్‌బర్గ్ పోటీ పడ్డారు. గతేడాది సెప్టెంబర్‌లో జుకర్ సంపద ఒక్కసారిగా 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్‌లు కూడా 382 డాలర్లకు చేరుకుంది. ఆ తరవాతే జుకర్ బర్గ్ మెటా సంస్థను నెలకొల్పారు. ఫేస్‌బుక్‌ పేరునీ మెటాగా మార్చేశారు. 


మెటా అవతార్ స్టోర్స్..


మెటా సంస్థ త్వరలోనే "మెటా అవతార్ స్టోర్స్‌"ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు గతంలో వెల్లడించారు. అంటే మనరూపంలో ఉన్న ఓ మెటావర్స్ అవతార్‌ను క్రియేట్ చేసుకుని మనకు ఏ ఫ్యాషన్ నప్పుతుందో చూసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మెటా అవతార్ స్టోర్స్ డిజిటల్ డిజైనర్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యాషన్‌ పార్టనర్‌షిప్స్ వైస్‌ ప్రెసిడెంట్ ఎవా చెన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఉన్న సమయంలో ఈ విషయం ప్రస్తావించారు జుకర్‌బర్గ్. ఫ్యాషన్ విషయంలో యువత ఏం కోరుకుంటోందో అదే వాళ్లకు చేరువ చేయాలని, ఈ మెటా అవతార్ స్టోర్స్‌ ద్వారా వాళ్లకు నచ్చిన ఔట్‌ఫిట్‌లను సెలెక్ట్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. మెటావర్స్‌లో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని అంటున్నారు జుకర్ బర్గ్. క్రియేటివ్ ఎకానమీని పెంచుకునేందుకు ఇలాంటి ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వోగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం...ఈ అవతార్‌ స్టోర్‌లోని దుస్తులు 2.99 నుంచి 8.99డాలర్ల రేంజ్‌లో ఉంటాయి. ఈ స్టోర్ ద్వారా తమ బ్రాండ్స్‌ని మరింత సులువుగా ప్రమోట్ చేసుకునేందుకు వీలవుతుందని అంటున్నారు ఆయా బ్రాండ్స్ ఓనర్స్. 


Also Read: NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ సోదాలు - ఆ పార్టీ ఆఫీసులే లక్ష్యంగా! ఏపీ, తెలంగాణలోనూ