Aluri Lalitha: మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు, విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యురాలు కామ్రేడ్ ఆలూరి లలిత ( 76) ఇటీవల కన్నుమూశారు. నవంబర్ 21న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలూరి లలిత (అమ్మ) మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ నివాళులు అర్పించిందని తెలిపారు. 


మావోయిస్ట్ కామ్రేడ్ లలిత, భుజంగారావులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. తమ ముగ్గురు కూతుళ్లను విప్లవోద్యమంలోకి నడిపించగలిగిన ఆ తల్లితండ్రులు తమ ఏకైక కుమారుడ్ని వదలి దశాబ్ద కాలం రహస్య జీవితంలో ఉన్నారని తెలిపారు. పార్టీ అప్పగించిన విప్లవ బాధ్యతలన్నీ ఆమె బాధ్యతగా నెరవేర్చారని ప్రశంసించారు. వారిద్దరూ తమ చిన్ననాటి నుంచి వామపక్ష భావాలతో ఉంటూ, నక్సల్బరీ నుండి విప్లవోద్యమం పక్షమే దృఢంగా నిలిచారు. 1985-96 వరకు దాదాపు దశాబ్ద కాలం వరకూ దండకారణ్య ఉద్యమ నాయకత్వానికి కామ్రేడ్స్ భుజంగారావు పెద్దన్నగా, లలిత అమ్మగా ఉంటూ గురుతరమైన విప్లవ బాధ్యతలు నిర్వహించారు. 


పట్టణాలలో పార్టీ ఏర్పాటు చేసిన రహస్య కేంద్రాల్లో ఉంటూ శత్రువుల కళ్లు కప్పి విప్లవ సేవలు కొనసాగించారని పేర్కొన్నారు. రహస్య జీవితంలో పెద్దన్నతో పాటు తానూ ప్రభాత్ పత్రికా నిర్వహణలో ఉంటూ పోలీసుల కళ్లు కప్పి పెద్ద పెద్ద బండిల్స్ నగరం నడిబొడ్డు నుండి అడవికి చాకచక్యంగా చేరవేయడంలోముఖ్యంగా అమ్మ పోషించిన పాత్ర విప్లవోద్యమంలో ప్రతిభావంతమైన మహిళల సేవలకు ఒక నమూనాగా ఉండిపోతాయని కొనియాడారు.


అనారోగ్యం కారణంగా గుల్బర్గాలో ఉంటున్న కుమారుడు శివప్రసాద్‌రావు దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. భుజంగారావుతో కలిసి దశాబ్దానికి పైగా అజ్ఞాత జీవితం గడిపారు. భుజంగారావు రచనలు, ప్రసంగాలలో భాగస్వామిగా నిలిచారు. గత 40 ఏళ్లు ప్రజా సంఘాలతో ఆమె కలిసి పని చేశారు. ఆమె చాలాకాలం నుంచి విరసం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇటీవల కన్నుమూసిన ఆమెకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పించింది.


Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి