కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయో లేదో.. మన ఇండియాలో చాలామంది మాస్కులు పెట్టుకోవడం మానేశారు. వ్యాక్సిన్ వేయించుకున్నాం.. మాకేమీ కాదులే అన్న ధీమాతో విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు. ఇది ఇండియా.. ఇక్కడ మనకు చాలా స్వేచ్ఛ ఎక్కువ. కాబట్టి.. అవేమీ పెద్దగా పట్టించుకోం. కానీ, కొన్ని దేశాల్లో ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అవసరం అనుకుంటే మాస్క్ పెట్టుకోకుండా తిరిగేవాళ్లను మెంటల్ హాస్పిటల్‌కు పంపిస్తారు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, సింగపూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే. 


ఫేస్‌మాస్క్‌లు కరోనా వైరస్ నుంచి రక్షిస్తాయనే సంగతి తెలిసిందే. పలు అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇంట్లో మాస్కులు లేకుండా ఎంత స్వేచ్ఛగా తిరిగినా.. బయటకు వెళ్తే మాత్రం తప్పకుండా మాస్కులు ధరించాలి. లేకపోతే ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా భారీ మూల్యమే చెల్లించాలి. ఇక సింగపూర్ వంటి దేశాల్లో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. 


యూకేలోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన 40 ఏళ్ల బెంజమిన్ గ్లేన్ ఈ ఏడాది మే నెలలో సింగపూర్‌లో మాస్క్ లేకుండా మెట్రో రైలు ఎక్కాడు. మాస్కులు జనాలను కాపాడలేవని, అవి పెట్టుకున్న వేస్ట్ అనే ఉద్దేశంతో అతడు మాస్కు లేకుండానే తిరిగాడు. దీంతో కొందరు అతడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు ప్రయాణం ముగిసిన కొద్ది గంటల్లోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో మాస్క్ పెట్టుకోకుండా తిరగాడనే కారణంతోపాటు మరో మూడు కేసులు నమోదు చేశారు. 


ఈ కేసు విచారించిన కోర్టు అతడిని మెంటల్ హెల్త్ ఫెసిలిటీలో చేర్చాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై గ్లేన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇది అర్థంపర్థం లేని చెత్త తీర్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింగపూర్ కోర్టు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించాడు. ఓ బ్రిటీష్ రిక్రూట్మెంట్ కంపెనీకి చెందిన సింగపూర్ బ్రాంచ్‌లో గ్లేన్ పనిచేస్తున్నాడు. 2017 నుంచి అతడు అక్కడే నివసిస్తున్నాడు. మెంటల్ ఫెసిలిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్లేన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాకు తెలిపి కోర్టు తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశాడు. 


ఏప్రిల్ నెలలో ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ముఖాలకు మాస్కుల తరహా పెయింటింగులు వేసుకుని సూపర్ మార్కెట్లో తిరిగారు. మాస్కులు ధరించకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పువాటిల్లేలా పిచ్చి వేషాలను వేసినందుకు అధికారులు వారి పాస్‌పోర్టులను సీజ్ చేశారు. తాజాగా స్పెయిన్‌లో కొంతమంది ప్రయాణికులు మాస్క్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేసిన ఘటన కూడా కూడా సోషల్ మీడియాలో చర్చనీయమైంది. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. 


మాస్క్ పెట్టుకోని వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి: