ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన కామెంట్స్ తో మాటకు మాట అన్న పరిస్థితి నెలకొంది. కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా కామెంట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమయ్యిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అప్పులు చేయడంలేదా అని ప్రశ్నించిన ఆయన... ఆ రాష్ట్రాలు సొంతంగా నోట్లు ముద్రించుకుంటున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన అప్పులపై కూడా లెక్కలు బయటకు తీయాలని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ కేంద్రాన్ని నిందించలేదన్నారు. పోలవరం నిధులు వేగంగా తీసుకువచ్చి ఈ క్రెడిట్‌ అంతా బీజేపీ తన ఖాతాల్లో వేసుకోవచ్చని సజ్జల అన్నారు. 


బీజేపీ నేతలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. నిన్న కేబినేట్ భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి పేర్నినాని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కాషాయదళంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓ మతతత్వ పార్టీ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదోరకంగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తుందని అంజాద్ బాషా ఘాటు విమర్శలు చేశారు.  ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటైన కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సంకేతాలు ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 


ఏపీలో కాషాయ సీఎం తీసుకువచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాసిన అవసరం తమకు లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్​ సునీల్ దేవధర్ ట్వీట్ పెట్టారు. ఆ ఆలోచన కూడా తమ పార్టీకి లేదన్నారు.  జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న భయంతో ఆ పార్టీ నేతలు అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలే వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సినంత అవసరం తమకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసమే తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సమాజసేవే ప్రథమ లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందన్నారు.


Also Read: BJP YCP Fight: రాబోయే రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ కలకలం...