నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్ పీజీ) పరీక్ష దరఖాస్తు సవరణలకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) కీలక ప్రకటన చేసింది. నీట్ పీజీ 2021 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, దరఖాస్తులలో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్లు, సవరణల కోసం ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటల నుంచి విండో మరోసారి ఓపెన్ అవుతుందని పేర్కొంది. ఆగస్టు 20 వరకు దరఖాస్తు సవరణలు చేసుకోవచ్చని చెప్పింది. నీట్ పీజీ పరీక్ష కోసం nbe.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
ఇంటర్న్‌షిప్ అభ్యర్థులు కూడా..
2021 జూలై 1 నుంచి 2021 సెప్టెంబర్ 31 మధ్య ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనున్న అభ్యర్థులు కూడా నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ వివరాలలో ఏమైనా సవరణలు ఉంటే ఈ విండో ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. అయితే దరఖాస్తు ఫారమ్‌లో ఇప్పటికే అందించిన ఇతర సమాచారాన్ని మాత్రం సవరించలేరని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ సవరణలకు అవకాశం కల్పించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను (NTA) కోరారు. దీంతో మరోమారు సవరణలకు అవకాశం కల్పించింది.
నీట్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు..
ఇక నీట్ యూజీ 2021 రిజిస్ట్రేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించడానికి ఆగస్టు 10వ తేదీ రాత్రి 11.50 వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు దరఖాస్తు సవరణలకు సైతం ఛాన్స్ ఇచ్చింది. దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే సవరించుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 11వ తేదీ నుంచి 14న మధ్యాహ్నం 2 గంటల వరకు సవరణలకు అవకాశం కల్పించింది.
కాగా, నీట్ యూజీ పరీక్షను సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదటిసారిగా నీట్ పరీక్షను పదమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ భాషల్లో నీట్ పరీక్ష రాసే అవకాశం ఉంది.
Also Read: Mains 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా.. 8 మందికి వంద పర్సంటైల్..