కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన ఆమె... ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పొందూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. ఇక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.




పొందూరు ఖద్దరు ఖ్యాతిని మరింత పెంచాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను పరిశీలించారు. ఖాదీ భవనం నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రధాని మోదీ పలు పథకాలు ప్రకటించారని ఆమె అన్నారు. 
Also Read: YSRCP Vs BJP: ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవట్లేదు. మీరే గొయ్యి తవ్వుకున్నారు.. వైసీపీకి బీజేపీ కౌంటర్..!




 
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. శ్రీకాకుళంలో పర్యటన అనంతరం నేటి మధ్యాహ్నం 3 గంటలకు జేవీఆర్‌ కన్వెన్షన్‌లో బీజేపీ శ్రేణులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అనుమతి పాస్‌లు ఉన్నవారికే ఈ సమావేశానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 


నిర్మలమ్మకు ఉక్కు సెగ


నిన్న సాయంత్రం విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు ఉక్కు కార్మికుల సెగ తగిలింది. ఆమె రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. సీతారామన్ రాక విషయాన్ని తెలుసుకుని భారీ సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
Also Read: Andhra Pradesh: వేషం మార్చిన సబ్ కలెక్టర్... షాక్‌లో ఎరువుల దుకాణదారులు… ఆనందంలో రైతులు


గాంధీ మెచ్చిన ఖద్దరు..


పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఒక రకమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీస్తారు. ఈ దారాలను మగ్గాలపై ఒడికి ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తుచేస్తుంది. మహాత్మా గాంధీ పొందూరు ఖద్దరు ఇష్టపడేవారు. పొందూరులో ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై ఖద్దరు వస్త్రాలు నేస్తారు. మగ్గాలతోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల సాయంతో ఖద్దరు వస్త్రాలు నేస్తారు.