నేత లుంగీ.. పాత చొక్కా.. మెడలో తువ్వాలు..ముఖానికి మాస్కు… ద్విచక్రవాహనంపై ఓ రైతు కైకలూరులో ఓ ఎరువుల దుకాణానికి వెళ్లారు. డీఏపీ ఎరువులు ఉన్నాయా? అని అడగ్గా లేవంటూ సమాధానం వచ్చింది. సమీపంలోని మరో దుకాణంలోకి వెళ్లి యూరియా, డీఏపీ బస్తాలను తీసుకున్నారు. బిల్లు కావాలని అడిగితే ఆ దుకాణదారుడు తెల్లపేపరుపై రాసిచ్చాడు. ఆ రైతు దాన్ని తీసుకొని మారుమాట్లాడకుండా సంబంధిత గోదాముకు వెళ్లి ఎరువుల బస్తాను ద్విచక్ర వాహనంపై వేసుకుని మళ్లీ నేరుగా దుకాణం వద్దకు వచ్చారు.


కట్‌ చేస్తే.. హఠాత్తుగా అధికార యంత్రాంగం ఆ దుకాణం వద్ద ప్రత్యక్షమైంది. ఎరువులు తీసుకెళ్లిన వ్యక్తి అట్నుంటి అటే ఇంటికెళ్లకుండా మళ్లీ దుకాణం దగ్గరకు ఎందుకొచ్చాడు? ఇంతలోనే అధికారుల హడావుడి ఏంటి? అసలేం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థంకాలేదు. కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టిందన్నది మాత్రం తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది.




రైతుగా వచ్చిన వ్యక్తి మరెవరో కాదు కృష్ణా జిల్లా విజయవాడ సబ్‌ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ అని తెలిసి దుకాణదారుల గుండెలు జారిపోయాయి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థంకాక బిక్కమొహాలు వేసుకుని నిల్చున్నారు. అయితే ఎరువులు నిల్వ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం, బిల్లు ఇవ్వకపోవడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఫిర్యాదులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని, జిల్లా కలెక్టరు జె.నివాస్‌ ఆదేశాల మేరకు వాస్తవాలను స్వయంగా తెలుసుకునేందుకు రైతుగా మారాల్సి వచ్చిందన్నారు సబ్‌ కలెక్టరు ప్రవీణ్‌చంద్‌. యూరియు బస్తాపై రూ.266.50 ఉండగా రూ.280కి, డీఏపీ ధర రూ.1200 ఉండగా రూ.1250కి విక్రయించినట్లు చెప్పారు.


నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్న రెండు ఎరువుల దుకాణాలను సీజ్‌ చేయాలని తహసీల్దార్‌ సాయి కృష్ణకుమారికి ఆదేశాలు జారీ చేశారు. దుకాణదారులపై 6-ఎ కేసులు నమోదు చేశారు. అనంతరం ముదినేపల్లిలో పలు దుకాణాలను పరిశీలించారు. ముదినేపల్లి మండలం దేవపూడిలోని దుకాణంలో ఉన్న రూ.79,990 విలువైన 13 టన్నుల యూరియా విక్రయాలను 21 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు ఏవో విద్యాసాగర్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సూర్యారావు, వ్యవసాయశాఖ ఏడీ గంగాధరరావు, ఆర్‌ఐ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.




ఈ మొత్తం వ్యవహారం చూసి ఎరువుల వ్యాపారులు వణికిపోతుంటే…రైతులు మాత్రం సంబరపడుతున్నారు. ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే ఉండడం లేదని.. అలాంటిది స్వయంగా సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమార్కులపై కొరడా ఝుళిపించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో కూర్చుని ఫిర్యాదులు స్వీకరించేకన్నా ఇలా క్షేత్రస్థాయిలో అడుగుపెడితేనే అక్రమాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ లా ప్రజలకోసం పనిచేసే అధికారులను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు రైతులు.