AP BJP announces Paka Venkata Satyanarayana as Rajya Sabha candidate: ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఒక్క రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ స్థానం సోము వీర్రాజు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన నేతకు రాజ్యసభ సీటు కేటాయించారు.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక
వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. మరో నాలుగేళ్ల వరకూ పదవి కాలం ఉన్న స్థానం కావడంతో ఎవరికి లభిస్తుందో అన్న చర్చ ప్రారంభమయింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని అనుకున్నారు. అయితే రాను రాను ఆయన పేరు వెనుకబడిపోయింది. తమిళనాడు రాజకీయ పరిణామాల రీత్యా.. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపి.. కేంద్ర మంత్రిని చేస్తారని అనుకున్నారు . అలాగే స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. కానీ .. చివరికి స్థానిక నేత అయిన పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
బలహీన వర్గాలకు పార్టీ అవకాశం కల్పించిందని ఆ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ కు మంగళవారమే చివరి రోజు.
పదవులన్నీ ఒకే ప్రాంతానికి కేటాయిస్తూ ఉండటంతో బీజేపీలోని ఇతర ప్రాంత నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి కూడా గోదావరి జిల్లాలకు చెందిన వారే. కూటమిలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ, రాజ్యసభ కూడా అదే ప్రాంతానికి ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా సాంకేతికంగా అదే ప్రాంతానికి చెందినట్లు .రాయలసీమ నేతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆ ప్రాంతానికి ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్నారు. ఆమె స్థానంలో ఇతరుల్ని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది.