ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూల్చే ప్రయత్నం చేస్తోందంటూ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమకు జగన్ సర్కార్‌ను కూల్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా లేదని.. కానీ ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి,అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారని ట్వీట్ చేశారు.







అలాగే కేంద్రం కూడా అప్పులు చేస్తోందన్న పేర్ని నాని చేసిన విమర్శలపైనా సునీల్ ధియోధర్ స్పందించారు. కేంద్రం అప్పులు చేసినా... పప్పు, బెల్లాల్లా పంచడానికి చేయడం లేదని విమర్శించారు.  కేంద్రానికి ఉన్న ఆర్థిక స్థోమత, వెసులుబాటు మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ దేశ ప్రతిష్టను పెంచుతూంటే వైసీపీ రాష్ట్రాన్ని ముంచుతోందని మండిపడ్డారు.




పేర్ని నాని వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా బీజేపీపై ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతోనే చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా కేంద్రంపై ఒత్తిడి చేసి అప్పులకు అనుమతి ఇచ్చేలా చేసుకోవడానికి ఈ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా.. పేర్ని నాని ప్రకటనను ఖండించారు. ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లు ఉందని విమర్శించారు.



కేంద్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగానే ఉంటోంది. రాష్ట్రంలోనూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్న సందర్భాలు కూడా తక్కువే. అయితే అనూహ్యంగా పేర్ని నాని బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా కలకలం ప్రారంభమైంది. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తారా లేక వరుస విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.