కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన వేళ. అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం భారత్ 100ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా భారత్‌కు అథ్లెటిక్స్‌లో మొదటి పతకాన్ని అందించాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఏకంగా స్వర్ణ పతకాన్నే అందించాడు. స్వతంత్ర భారతదేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. 23 ఏళ్ల నీరజ్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో రెండో ప్రయత్నంలో అతడు ఈటెను ఏకంగా 87.58మీటర్లు విసిరి పతకం ఖాయం చేసుకున్నాడు.
తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఈటెను 87.03మీటర్లు విసిరాడు. క్వాలిఫికేషన్‌లో 86.59మీ. కంటే ఇది అధికం. రెండో ప్రయత్నంలో... మొదటి దాన్ని అధిగమించాడు. ఏకంగా 87.58మీటర్లు జావెలిన్‌ను విసిరి ప్రత్యర్థులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 76.79మీటర్లు విసిరాడు. ఆ తర్వాత కాస్త ఒత్తిడికి గురైన నీరజ్ నాలుగు, ఐదు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 84.24మీటర్లు విసిరాడు. నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్(86.67 మీటర్లు)కు రజతం దక్కగా అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్ స్లావ్(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు నీరజ్ చోప్రా అత్యుత్తమం 88.07మీటర్లు.
శుభాకాంక్షల వెల్లువ
జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల శుభాకాంక్షలు తెలిపారు.
ఈటె విసిరితే పతకమే
ఏ పోటీలకు వెళ్లినా... నీరజ్ చోప్రా ఈటె విసిరాడు అంటే పతకం ఖాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతోనే అతడు పతకం సాధిస్తాడని భారతీయులు భావించారు. 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.
హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అభినవ్ బింద్రా తర్వాత నీరజ్ చోప్రానే
అప్పుడెప్పుడో భారత షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించాడు.
Tokyo Olympics 2020: పతకంపై ఆశలు రేపి... నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గోల్ఫర్ అదితి అశోక్