ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు రేపింది. కానీ, అనూహ్య రీతిలో పోటీలు ముగిసే సమయానికి టాప్-3లో స్థానం కోల్పోయి పతకానికి దూరమైంది. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో అదితి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. పతకం తెస్తుందనుకున్న అదితి త్రుటిలో పతకం కోల్పోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మూడో రోజు(శుక్రవారం) ఆట ముగిసే సమయానికి అదితి 2వ స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. శనివారం ఆట ప్రారంభమైనప్పటి నుంచి కూడా అదితి మంచి ప్రదర్శన చేస్తూనే వచ్చింది. న్యూజిలాండ్‌కు చెందిన గోల్ఫర్ లిడియా... అదితితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగింది. వర్షం కారణంగా నాలుగో రౌండ్ ఆటను నిర్వాహకులు కాసేపు నిలిపివేశారు.
కేవలం రెండు హోల్స్ ఉన్న సమయంలో.. వర్షంతో మ్యాచ్ నిలిపి వేశారు. ఆ సమయానికి మొదటి ప్లేస్‌లో నెల్లీ కోర్డా, రెండో ప్లేస్‌లో ఇనామీ ఉన్నారు. మూడో ప్లేస్‌లో అతిది(భారత్)-లైడియా కో(న్యూజిలాండ్) సంయుక్తంగా ఉన్నారు. దీంతో వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయినా అదితికి రజతం ఖాయం అనుకున్నారు. కానీ, మనం ఒకటి తలిస్తే... విధి మరోటి తలిచింది.
అదితి పోటీతత్వం చూసిన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ‘నువ్వు ఇప్పటికే చరిత్ర సృష్టించావు, విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన తొలి భారత క్రీడాకారిణివి, నువ్వు పతకం సాధించకపోయినా మమ్ముల్ని సంతోషపెట్టావు, నీ అద్భుతమైన ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 200వ స్థానంలో ఉన్న అదితి.. గత నాలుగు రోజుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో రాణించింది. 23 ఏళ్ల ఆదితి తన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నది.
జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, రెజ్లర్ భజరంగ్ పునియా మీదే భారత్ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ పతకం తెస్తారని యావత్తు భారతదేశం భావిస్తోంది. ఈ రోజుతో భారత ఆటగాళ్లు పాల్గొనే పోటీలు అయిపోయినట్లే. రేపటితో విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ ముగుస్తాయి.