ఆహ్లాదంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. రాష్ట్రంలోనే ఇంధన వ్యయానికి సరిపడా రాబడిని తెచ్చిపెడుతూ ఏపీలో రెండోస్థానంలో తిరుమల ఆర్టీసీ విభాగం ఉంది. అయితే ప్రశాంతమైన సప్తగిరులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయంటే అందుకు కారణం ఆర్టీసీ అని కూడా అంటున్నారు. అందుకే కాలుష్యం వెదజల్లే బస్సులకు చెక్ పెట్టి కాలుష్యరహిత వాహనాలు వినియోగానికి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య భవన్లో నిర్వహించిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ మొదటి సమావేశంలో చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి, కన్వీనర్ ఏవి ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు తిరుమల అభివృద్ధిపై  పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.




గ్రీన్ ఎనర్జీ వినియోగం దిశగా చర్యలు చేపట్టామని, తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతామన్నారు చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి. ఇందుకోసం 35 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసారు. 35 టాటా ఎనక్స వాహనాలను ఉద్యోగులు కేటాయిస్తామని... కాలుష్య నివారణ టీటీడీ యంత్రాంగంతోనే మొదలెడతామన్నారు. నెలకి రూ.32 వేల చొప్పున చెల్లిస్తారని చెప్పిన అయన... ఐదు సంవత్సరాల అనంతరం వాహనాలు సొంతం అవుతాయన్నారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టనున్నాయి.


గతేడాది వారం రోజుల పాటు ఒక ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా తిరుపతి- తిరుమల మధ్య నడిపించారు. 32 మంది కూర్చునే విధంగా ఈ బస్సును అశోక్ లైలాండ్ సంస్థ తయారు చేసింది. ఈ బస్సును నడిపేందుకు అధికారులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. తిరుమలకు నిత్యం వచ్చే ఆర్.టి.సి బస్సుల స్థానంలో విడతల వారీగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.




టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ తీసుకున్ననిర్ణయాలు



  • 21-22 డైరీలు, 12 లక్షల క్యాలెండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రణ

  • చినజియర్ స్వామి రాయలసీమలో పర్యటించి ఆలయాలు అభివృద్ధి చేయాలని సూచన

  • మొత్తం పది ఆలయానికి రూ.10 కోట్ల నిధులు కేటాయింపు

  • చిత్తూరు వాయిల్పాడులో ఆలయం రాతి నిర్మాణంకోసం రూ.6 కోట్లు కేటాయింపు

  • నెల్లూరు జిల్లాలో సీతారామ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయింపు

  • బర్డ్‌ చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయింపు

  • గో సంరక్షణ కోసం తిరుపతి, తిరుమల, పలమనేరులో మూడు గోశాలలు అభివృద్ధి

  • స్వామివారి నైవేద్యానికి దేశీయ ఆవుల పాలు వినియోగంచాలని నిర్ణయం… త్వరలోనే తిరుమలకు 25 గిర్ ఆవులు

  • స్వామివారి ప్రసాదానికి నెయ్యి తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నూతనసేవ నవనీత ప్రారంభం

  • దీపారాధనకి నెయ్యి, భక్తులు విరాళంగా ఇవ్వవచ్చు, దేశీయ ఆవు నెయ్యి మాత్రమే ఇవ్వాలి

  • 15రకాల పంచగవ్య ఉత్పత్తుల-నాలుగు నెలల్లో భక్తులకు అందుబాటులోకి

  • శ్రీవాణికి ప్రాయారిటీ దర్శనం,ఇప్పట్లో దర్శనాల‌ సంఖ్య పెంచేది లేదు

  • శ్రీవాణి ట్రస్టుకి 150 కోట్ల రూపాయలు కేటాయింపు… ట్రస్టు ఆధ్వర్యంలో ఊరికో గుడి నిర్మాణం

  • శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో త్వరలోనే నిర్ణయం


మరోవైపు వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్‌లో అందబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు వర్చువల్‌ సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ తెలిపింది.