రెజ్లింగ్‌లో పసిడి కల నెరవేరుస్తాడనునకున్నరెజ్లర్ బజ్‌రంగ్ పునియా(65కేజీ) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పోరులో పునియా... కజకిస్థాన్ ఆటగాడు నియాజ్ బెకావ్ పై 8-0 తేడాతో ఘన విజయం సాధించాడు.
తొలి పిరియడ్ లో రెండు పాయింట్లు సాధించిన పునియా ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. రెండో పిరియడ్ లో రెండేసి పాయింట్లు మూడు సార్లు సాధించాడు. దీంతో అతడి గెలుపు లాంఛనం అయిపోయింది. ఈ పోరులో ప్రత్యర్థి పాయింట్ల ఖాతాను తెరవనేలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ లో భారత్‌కు ఇది రెండో పతకం. నిజానికి బజరంగ్ స్వర్ణ పతకం సాధిస్తాడని అనుకున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో అతడు ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్. అయితే సెమీస్‌లో అతడి డిఫెన్స్ బాగా లేదు. ఇదే అదనుగా భావించి ప్రత్యర్థి అతడి కాళ్లను ఒడిసిపట్టి ఓడించాడు.
పునియాకు రూ. 2.5కోట్ల నగదు బహుమతి
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెజ్లర్ బజరంగ్ పునియాకు హరియాణా ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. రూ. 2.5కోట్ల రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
శనివారం జరిగిన కాంస్య పోరులో బజరంగ్ పతకం గెలవడంపై ఖట్టర్ సోషల్‌మీడియా వేదికగా పునియాపై ప్రశంసలు కురిపించారు. బజరంగ్ కేవలం పతకం మాత్రమే గెలవలేదని, యావత్ భారతావని మనసులు గెలుచుకున్నాడని అన్నారు. ఈ సందర్భంగా అతడికి రూ. 2.5కోట్ల నగదు బహుమతితో పాటు అతడి స్వస్థలమైన ఖుందన్ గ్రామంలో ఇండోర్ స్టేడియంను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతేగాక, 50శాతం రాయితీతో ప్లాట్‌ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖట్టర్ తన ఆఫీస్‌లో బజరంగ్ కాంస్య పతక పోరును వీక్షిస్తున్న ఫొటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో హరియాణా నుంచి పాల్గొన్న ప్రతి అథ్లెట్‌కు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఖట్టర్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా పునియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు.