‘మా’ ఎన్నికలు రోజు రోజుకు మరింత హాట్‌గా మారుతున్నాయి. ఈ సారి ఒకేసారి ఐదుగురు అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన నేపథ్యంలో ఎన్నికల పర్వం రంజుగా మారుతోంది. ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావులు పోటీలో నిలవడంతో నటీనటులంతా ఐదు వర్గాలుగా చీలిపోయారు. అయితే, ఇటీవల మంచు విష్ణు ఎన్నికలను ఏకగ్రీవం కావాలని చెప్పడంతో వివాదం ముదిరింది. ఆ వేడి ఇంకా చల్లారకుండానే.. తాజాగా నటి హేమా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న హేమా తాజాగా తోటి నటీనటులు, నిర్మాతలకు, సభ్యులకు తన వాయిస్ రికార్డు పంపారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆమె ఆ రికార్డులో పేర్కొంది. ఈ సందర్భంగా నరేష్ మీద ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నరేష్‌ను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. మా అసోషియేషన్‌లోని రూ.5 కోట్ల నిధుల్లో ఇప్పటికే నరేష్ రూ.3 కోట్లను ఖర్చు చేశారని తెలిపారు.
ఇదివరకు ఆఫీస్ ఖర్చులకు బయట నుంచి నిధులు తీసుకొచ్చి ఫండ్ రైజ్ చేసేవాళ్లం, కానీ నరేష్ హాయిగా కూర్చొని అకౌంట్లోని సొమ్ములన్నీ ఖర్చుపెట్టేస్తున్నారని హేమా ఆరోపించారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలను తప్పకుండా నిర్వాహించాలనే డిమాండ్‌తో 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నానని ఆమె ఆ వాయిస్ మెసేజ్‌లో తెలిపారు. ఇంతవరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించలేదని, రూ.5 కోట్ల నిధులను రూ.2 కోట్లకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
గత మెడికల్ క్లైమ్, రానున్న మెడికల్ క్లైమ్‌కు కలిపి సుమారు రెండున్నర కోట్లకు పైగా ఖర్చయ్యాయని, ఆఫీస్ ఖర్చులతో కలిపితే సుమారు రూ.3 కోట్లు అవుతుందని అన్నారు. నరేష్ ఆ కూర్చీ దిగకూడదు, ఎన్నికలు జరగకూడదని ప్లాన్ చేస్తున్నారని, ఎన్నికలు తప్పకుండా జరగాలనే డిమాండుతోనే ఈ లేఖ పంపుతున్నానని హేమా తెలిపారు. అంతా ఎన్నికల జరిగేందుకు మద్దతు తెలపాలని కోరారు.
గత కొన్ని రోజులుగా మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ మధ్యే వాగ్వాదం నెలకొంది. మంచు విష్ణు ఎన్నికలు ఏకగ్రీవం కావాలని చెబుతుంటే.. ప్రకాశ్ రాజ్, ఇతర పోటీదారులు ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నారు. తాజా హేమా చేసిన వ్యాఖ్యలు మున్ముందు ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి. ఇప్పటికే ‘మా’ అధ్యక్షుడు నరేష్ మద్దతుదారులు హేమా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై నరేష్ ఇంకా స్పందించాల్సి ఉంది.