Siddipet News : తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలను కబడ్డీ కోర్టులో నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వద్ద సంక్రాంతి పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు పులికాశి సంపత్ మృతి చెందాడు. దీంతో అతని స్వగ్రామం అక్కన్నపేట మండలం చౌటపల్లిలో వినూత్నంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

Continues below advertisement


కబడ్డీ సీనియర్ క్రీడాకారుడైన సంపత్ అంత్య క్రియలను భిన్నంగా నిర్వహించి.. అతనికి ప్రత్యేక నివాళి ఘటించాలన్న ఉద్దేశంతో.. కబడ్డీ క్రీడాకారులు, స్నేహితులు, గ్రామస్థులు.. దహనం చేయాల్సిన ప్రదేశంలోనే కబడ్డీ కోర్టు గీశారు. కోర్టునంతా పూలతో అలంకరించి, కబడ్డీ క్రీడాకారుడి చితికి నిప్పంటించారు. యుక్త వయసు నుంచే కబడ్డీలో రాణించాలనే ఆశయంతో ఉన్న సంపత్.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తనకు ఎంతో ఇష్టమైన ఆటను త్యాగం చేశాడు. కబడ్డీని పక్కన పెట్టి లారీ డ్రైవర్‌గా మారి కుటుంబానికి అండగా నిలిచాడు.



తాను చేరుకోలేకపోయిన లక్ష్యాన్ని వేరొకరైనా చేరుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలోని యువకులను కబడ్డీ ఆడేందుకు ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. అలా సంపత్ కొందరిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కూడా పంపించాడు. అంతటితోనే తృప్తి చెందేవాడు సంపత్. ఆయన ప్రోత్సాహంతోనే గంగాధరి మల్లేష్ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా రాణించాడు. ప్రస్తుతం ప్రో కబడ్డీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక సంపత్ మరణ వార్త విని చాలా మంది కబడ్డీ క్రీడాకారులు గ్రామానికి చేరుకున్నారు. ఆయన దహన సంస్కారాలను కబడ్డీ కోర్టులో జరిపి నివాళులర్పించారు. 


Also Read : Hyderabad Gun Firing News:అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో సాగుతున్న దర్యాప్తు- అమిత్‌ కుమార్ గ్యాంగ్ కోసం పది బృందాలు గాలింపు