Mumbai Police has announced that the accused who attacked Saif Ali Khan has not been arrested: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. సీసీ ఫుటేజీలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో విస్తృత ప్రచారం జరగింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కూడా. అయితే ప్రశ్నించిన తర్వాత అతను దాడి చేసిన వ్యక్తి కాదని స్పష్టత రావడంతో వదిలి వేశారు. దాడి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం వేకువజామున రెండున్నర గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి జొరబడిన దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ అలీఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడి చేసి పారిపోయాడు. అతను అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన మెట్ల ద్వారా వచ్చి దాడి చేసి.. అదే మెట్ల ద్వారా వెళ్లిపోయాడని అనుకున్నారు. ఈ మేరకు వారు ఉండే అపార్టుమెంట్ ఆరో అంతస్తులో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు పట్టుకున్న వ్యక్తి అతనేనా కాదా అన్నదానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. కానీ పట్టుకున్న వ్యక్తి మాత్రం దాడి చేయలేదని చెప్పి వదిలేశారు.
సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు ప్రకటించారు. వేగంగా కోలుకుంటున్నారని .. మెల్లగా నడుస్తున్నారని కూడా వైద్యులు తెలిపారు. వెన్నుముకు గాయం అయినందున పెరాలసిస్ వస్తుందన్న భయం కూడా డలేదన్నారు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశామని వారం వరకు ఆయన్ను విజిటర్స్ కలవడానికి లేదని స్పష్టం చేశారు. వెన్ను గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంని.. అందుకే ఎవర్నీ అనుమతించడం లేదని ప్రకటించారు. ఆయన హాస్పిటల్‌లోకి వచ్చినప్పుడు రక్తంతో తడిసిపోయి ఉన్నారని.. వెన్నులోకి దిగిన కత్తి మరో 2 మిల్లీమీటర్లు లోపలకు వెళ్లి ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చేదని వైద్యులు తెలిపారు.
అయితే అసలు ఏం జరిగింది.. దొంగ పదో అంతస్తు వరకూ ఎలా వచ్చాడన్నది మాత్రం పోలీసులు తేల్చలేకపోతున్నారు. సైఫ్ ఇంటి పని మనిషి మాత్రం.. దొంగ వచ్చాడని.. తనపై బెదిరింపులకు పాల్పడటంతో..కాపాడేందుకు సైఫ్ వచ్చాడని .. దాంతో దొంగ ఆయనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే కేసు పెట్టారు. సైఫ్ పై దాడి ఘటనతో బాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఎవరు దాడి చేశారో స్పష్టత రాకపోవడంతో మాఫియా గ్యాంగుల హస్తం ఏమైనా ఉన్నదా అని ఆందోళన చెదుతున్నారు. మాఫియాను డీల్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీసు అధికారి దయానాయక్ ను కూడా ఈ కేసు దర్యాప్తులో భాగం చేశారు.