Kharge On Congress:
ఆసక్తి చూపుతున్నాయ్: ఖర్గే
ఆసక్తి చూపుతున్నాయ్: ఖర్గే
మేఘాలయా, నాగాలాండ్, త్రిపురలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపు మూడు చోట్ల బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే..కాంగ్రెస్ మాత్రం ఢీలా పడింది. ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతోంది. భారత్ జోడో యాత్రతో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పార్టీ పుంజుకుంటుందని అంచనా వేసింది అధిష్ఠానం. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది ఫలితాల ట్రెండ్. త్రిపురలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ మాత్రం కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. నాగాలాండ్‌లో కాంగ్రెస్ మరీ దారుణంగా పడిపోయింది. ఎక్కువ మొత్తంలో సీట్‌లు వస్తాయని కాంగ్రెస్ ఆశించినప్పటికీ...అలా జరగలేదు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు సెక్యులర్ పార్టీలకు మద్దతునిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు.
"సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల పార్టీలు కేంద్ర ప్రభుత్వానికే సపోర్ట్ ఇస్తుంటాయి. కానీ చాలా మంది నేతల ఆలోచన తీరు మారిపోయింది. వాళ్లు కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీకి మద్దతుగా నిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ ముందుకొచ్చి తమతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు"
మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూస్తే...కాంగ్రెస్ త్రిపురలో 16 చోట్ల లీడ్‌లో ఉంది. నాగాలాండ్‌లో 3 చోట్ల, మేఘాలయాలో 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే మేఘాలయలో కాంగ్రెస్‌కు సీట్లు బాగా తగ్గాయి.
రాహుల్ గాంధీ నేతృత్వంలో నెలల పాటు సాగిన భారత్ జోడో యాత్ర ఈ మధ్యే ముగిసింది. కశ్మీర్‌లో సభ నిర్వహించి ఆ యాత్రకు ముగింపు పలికింది కాంగ్రెస్. ఈ జర్నీలో తాను ఎన్నో నేర్చుకున్నట్టు చెప్పారు రాహుల్ గాంధీ. అంతే కాదు. ఇది గ్రాండ్ సక్సెస్ అయిందనీ వెల్లడించారు. అయితే...కాంగ్రెస్ మరోసారి ఇలాంటి యాత్రే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మొదటి విడత యాత్ర సాగగా...రెండో విడతలో తూర్పు నుంచి పశ్చిమం వైపు యాత్ర సాగించాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకూ యాత్ర చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ తపస్సుని రాహుల్ గాంధీ మరి కొద్ది రోజుల పాటు కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
"కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర సాగింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇది రాహుల్ గాంధీ గమనించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ కొత్త శక్తితో పని చేశారు. అందుకే మరోసారి ఇలాంటి యాత్ర కొనసాగించాలని భావిస్తున్నాం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకూ యాత్ర చేపట్టాలని చూస్తున్నాం. అయితే...ఇది భారత్ జోడో యాత్రకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ మార్గంలో నదులుంటాయి. దాదాపు పాదయాత్రగానే ఇది కొనసాగుతుంది. కానీ అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ తీరు మారుతుంది. "
- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
Also Read: CM Yogi Adityanath: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు