Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకోవడానికి లోయలో సైన్యం అణువణువూ గాలిస్తోంది. తనిఖీలను ముమ్మరం చేస్తోంది. ఇలాంటి టైంలో కూడా ఉగ్రవాదులు బోర్డర్ దాటే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. బారామూలాలో వారిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి.
భారత సైన్యం చినార్ కార్ప్స్ బుధవారం (23 ఏప్రిల్ 2025)న ఎక్స్‌లో కీలక విషయం పోస్ట్ చేసింది. ఓ ఉగ్రవాదుల గుంపు ఉరి నాలా బారాముల్లాలో బోర్డర్ దాటి వచ్చేందుకు ప్రయత్నించారు. సాధారణ ప్రాంతంలో చొరబడటానికి ప్రయత్నించగా, నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద వారిని సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిపారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయని, దీనిలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని సైన్యం తెలిపింది. ఉగ్రవాదుల వద్ద నుంచి అధిక మొత్తంలో ఆయుధాలు, బుల్లెట్లు, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 2 ఏకే సిరీస్ రైఫిల్స్, ఐదు మ్యాగజైన్లు, ఒక పిస్టల్, పది కిలోల ఆర్‌సీఐఈడీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఎక్కడి నుంచి వచ్చారు. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఉగ్రవాదుల వద్ద నుంచి చాక్లెట్లు సిగరెట్లు కూడా స్వాధీనం
పాకిస్థాన్ నంచి ఈ ఉగ్రవాదుల వద్ద నుంచి కార్ట్రిడ్జ్‌లు, పాకిస్తాన్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్ల ప్యాకెట్లు కూడా లభించాయి. ఈ ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో ద్వారా లోయలో మరో పెద్ద దాడిని చేయాలని చూశారు, కానీ వారు చొరబాటు సమయంలోనే ఎన్‌కౌంటర్‌లో సైన్యం తూటాలకు హతమైపోయారు.
'వెనుక ఉఁడి కుట్రలు పన్నిన వారిని కూడా వదిలిపెట్టం'
పహల్గాం దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'ఈ దారుణమైన దాడికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఏకమై ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈ ఘటనకు కారణమైన వారిని మాత్రమే కాదు, వెనుక ఉండి ఎక్కడో కూర్చుని భారతదేశంలో ఇటువంటి దుష్ట ధ్వంస రచనకు కుట్ర పన్నిన వారందరినీ కూడా మేము చేరుకుంటాము.' మోడీ ప్రభుత్వం గురువారం సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పహల్గాం దాడిపై పార్లమెంట్‌లో అన్ని పార్టీల నేతలతో చర్చించనున్నారు.
ఇప్పటికే పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలు తీసుకుంది. ఐదు కీలక నిర్ణయాలు ఇప్పుడు పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయోబోతున్నాయి. అందులో సింధు జలాల ఒప్పందం రద్దు కీలకమైంది. సింధు నది నీరు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే దాహంతో అల్లాడిపోనుంది.