Strict action against Pakistan : జమ్మూకశ్మీర్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఆదేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న దానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
1. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు
- 1960లో ఒప్పందం చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
2. వాగా-అటారీ సరిహద్దు మూసివేత
భారత్ వాగా-అటారీ సరిహద్దును వెంటనే మూసివేసింది, దీనివల్ల రెండు దేశాల మధ్య సరిహద్దు ద్వారా వాణిజ్యం మరియు ప్రయాణాలు నిలిచిపోయాయి.
3. పాకిస్తానీ పౌరులకు వీసాల నిషేధం
- పాకిస్తానీ పౌరులకు భారత్‌లో వీసాల జారీని నిషేధించారు, దీనివల్ల రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు మరింత దిగజారుతాయి. ప్రత్యేక వీసాదారులు వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
4. పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం మూసివేత
- ఇస్లామాబాద్‌లోని భారతీయ హైకమిషన్‌ను మూసివేయాలని నిర్ణయించారు, అలాగే పాకిస్తాన్ నుంచి భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు.
5. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ సైనిక సలహాదారులను "పర్సోనా నాన్ గ్రాటా" గా ప్రకటించారు, వారిని దేశం విడిచి వెళ్లమని ఆదేశించారు.
పాకిస్తాన్‌తో అన్ని నయతంత్ర సంబంధాలను తెంచుకునే దిశగా పరిశీలన చేస్తున్నారు. పాక్ హైకమిషనర్‌ను ఇండియా నుంచి పంపించేయాలని నిర్ణయించారు.
ఇవన్నీ దౌత్యపరమైన చర్యలు.. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ సమావేశంలో తీవ్రవాదులపై తీసుకోవాల్సిన మిలటరీ చర్యలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న హై సీక్రెట్ గా ఉంచుతారు. దాడులు చేసిన తర్వాత మాత్రమే ప్రకటిస్తారు. అందుకే ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్ర వాదులపై చర్యలు ఉంటాయని భావిస్తున్నాయి. అవి ఏ రూపంలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఈ సారి ఏ రూపంలో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆలోచన చేస్తారోనని దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
అంతకు ముందు రాజ్ నాథ్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దాడి చేసిన వారిని మాత్రమే కాకుండా, వారి వెనుక ఉన్న శక్తులను కూడా మేము చేరుకుంటాము. దోషులకు త్వరలోనే స్పష్టమైన, బలమైన సమాధానం లభిస్తుందని హెచ్చరించారు. ఈ దాడిని ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన చర్యగా వర్ణించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలపై నమ్మకం ఉంచాలని దేశ ప్రజల్ని కోరారు.