Pahalgam Terrorist Attack Latest News: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత చిత్రసీమ ముక్త కంఠంతో ఖండించింది. బాలీవుడ్ ఖాన్ హీరోలు షారుఖ్, సల్మాన్, అమీర్ స్పందించలేదని తొలుత విమర్శలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు మాత్రమే కాదు... కుల మతాలకు అతీతంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండించారు. అయితే... ఈ దాడి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఫౌజీ' సినిమా వార్తల్లోకి వచ్చింది. ఎందుకో తెలుసా?
ప్రభాస్ జంటగా పాకిస్తానీ నటి ఎందుకు?
సినిమా నుంచి ఆమెను తీసేయాలంటూ డిమాండ్!
'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ జంటగా ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ (Imanvi Esmail) నటిస్తున్నారు. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఆవిడకు ఇదే మొదటి సినిమా. విదేశాల నుంచి ఆవిడ ఇండియా వచ్చినప్పటికీ... ఆమె మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉన్నాయి.
పాక్ మాజీ మిలటరీ అధికారి కుమార్తె ఇమాన్వి. ఢిల్లీలో వాళ్ళ ఫ్యామిలీ స్థిరపడింది. కానీ, ఆవిడ జన్మతః పాక్ దేశస్థురాలు. దాంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి ఆవిడను తీసేయాలంటూ సోషల్ మీడియాలో కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా వరకు చేసిన తర్వాత హీరోయిన్ రిప్లేసెమెంట్ అంటే నిర్మాతలకు బోలెడు ఖర్చు. పైగా, ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కావడం అంటే మామూలు విషయం కాదు.
సినిమాలకు, కళాకారులకు ప్రాంతంతో దేశంతో మతంతో ముడి పెట్టకూడదని గతంలో పలుసార్లు చిత్ర సీమ విజ్ఞప్తి చేసింది. ఉగ్ర దాడులు జరిగినప్పుడు పాకిస్తానీ నటీనటులను హిందీ సినిమాల నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపించేది. హిందీ సినిమాలతో పాటు ఇప్పుడు తెలుగు సినిమాలు సైతం ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ సొంతం చేసుకున్నాయి. నార్త్ ఇండియన్ ఇండస్ట్రీలో కూడా తెలుగు హీరోలకు పాపులారిటీ పెరుగుతోంది. మన హీరోలు చేసే సినిమాలపై ఉత్తరాది ప్రేక్షకుల చూపు పడుతోంది. అందుకు ఉదాహరణే ఇప్పుడు ప్రభాస్ సినిమా నుంచి ఇమాన్విని తీసేయాలనే డిమాండ్.