CM Yogi Adityanath Record:  


ఎక్కువ కాలం పాటు సీఎంగా..


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం పాటు సీఎంగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు. 5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి...గత ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ కాలం పాటు ఆ పదవిలో కొనసాగుతున్నారు. 5 సంవత్సరాల 347 రోజులుగా సీఎం కుర్చీలో ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఈ డా. సంపూర్ణానంద్ యూపీకి 5 సంవత్సరాల 345 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. 1954డిసెంబర్ 18 నుంచి 1960 డిసెంబర్ 6వ తేదీ వరకూ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఎక్కువ కాలం పాటు ఈ పదవిలో కొనసాగిన  వారిలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 5 సంవత్సరాల 4 రోజుల పాటు కొనసాగారు. తరవాత బీఎస్‌పీ చీఫ్ మాయావతి 4 సంవత్సరాల 307 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. మొత్తం నాలుగు సార్లు ఆమె సీఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ 3 సంవత్సరాల 257 రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీకి రావడానికి కారణమూ ఆయనే.


బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లు దాటిన వాళ్లు పార్టీలో ఏ పదవిలో ఉండకూడదు. అదే పరిస్థితి వచ్చి మోదీ ప్రధాని పదవి నుంచి దిగిపోతే...తదుపరి ఆ బాధ్యతలు తీసుకునేదెవరు..? అనే ఆసక్తికరమైన చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే...ఈ ప్రశ్న ఎన్ని సార్లు వినబడిందో..అన్ని సార్లు వినబడిన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న ఆయనకూ మంచి పేరే ఉంది. యూపీలోని రౌడీయిజాన్ని చాలా వరకు తగ్గించగలిగారన్న సానుకూల అభిప్రాయం ఉంది. బీజేపీలో మోదీ తరవాత చరిష్మా ఉన్న నేత యోగి ఆదిత్యనాథ్. అందుకే...మోదీ స్థానంలో ఆయనను మాత్రమే ఊహించగలం అని బీజేపీ శ్రేణులు పరోక్షంగా చెబుతున్నాయి. అయితే...ఇప్పటి వరకూ యోగి దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. అసలు ఆ సందర్భం రాలేదు కూడా. కానీ ABP News నిర్వహించిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్..ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రధాని అవుతారని భావిస్తున్నారా అని అడగ్గా...దానిపై వివరణ ఇచ్చారు. 


"నాకు ఇలా యోగిలా ఉండటమే ఇష్టం. నేను ముందు యోగిని. ఆ తరవాతే రాజకీయ నాయకుడిని. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తారా..? రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా అని ప్రశ్నిస్తే..నా అవసరం ఎక్కడుంటే అక్కడే ఉంటానని బదులిస్తాను. నేను 30 ఏళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నాను. రాజకీయాలు నా వృత్తి కాదు. నేనెప్పుడూ అలా మాట్లాడనూ లేదు. రాజకీయాలే సర్వస్వం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓ యోగి మార్గదర్శిగా నిలవాలి. అందుకే నేనీ సవాలుని తీసుకున్నా. నేను ప్రధాని అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. నాకు ఇలా యోగిలా ఉండటమే ఇష్టం" 


- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం 


Also Read: Adani stocks: అదానీ గ్రూప్‌పై సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశం - పరుగులు పెట్టిన స్టాక్స్‌